ఈ యేడాది మలయాళ చిత్రాల అనువాదాల హంగామా తెలుగులో బాగా పెరిగింది. జనవరి నెలలో ‘మార్కో’, ‘ఐడెంటిటీ’ చిత్రాలు తెలుగులో అనువాదం కాగా, మార్చిలోనూ మరో రెండు మలయాళ అనువాదాలు రాబోతున్నాయి. మార్చి 27న మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ నటించి, డైరెక్ట్ చేసిన ‘ఎంపరాన్’ రాబోతోంది. అయితే మొదటి వారంలో మరో మలయాళ చిత్రం తెలుగువారిని పలకరిస్తోంది. అదే ‘ఆఫీసర్… ఆన్ డ్యూటీ’. కుంచాకో బోబన్ హీరోగా నటించిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ మూవీలో ప్రియమణి నాయికగా నటించింది. ఫిబ్రవరి 20న ఈ సినిమా కేరళలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కుంచాకో ఇందులో పోలీస్ ఆఫీసర్ హరీశ్ శంకర్ గా నటించాడు. ముక్కుసూటిగా వ్యవహరించే హరీ వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటాడు. ఓ ఇమిటేషన్ గోల్డ్ రాకెట్ కు సంబంధించిన కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంటే… దానికి సెక్స్ రాకెట్ తోనూ, డ్రాగ్స్ మాఫియాతోనూ సంబంధం ఉందనే విషయం బోధపడుతుంది. సాధారణమైందని భావించిన ఆ క్లిష్టమైన కేసును హరి ఎలా సాల్వ్ చేశాడన్నదే ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ కథ. జీతు అష్రాఫ్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మార్చి 7న విడుదల చేస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.