Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ప్రత్యేక కథనం

ఎవరికి చేయాలి సన్మానం..!?

ఆక్రోషించే అక్షరాలు కొన్నైతే, ఆక్రోధించే అక్షరాలు మరికొన్ని, అక్షరం ఏదైనా అర్థం ఒకటే, ఆవేదన ఏదైనా దానికి కారణం ఒకటే, బాధలతో కుస్తీ పడతాం, భావోద్వేగాలకు బంధీలం అవుతాం, నిజా నిజాలు గ్రహించిన తర్వాత దేనికి ఈ బ్రతుకు అని ప్రశ్నించుకుంటాం ఇదే కదా జీవితం అంటే….

అలాంటి ప్రశ్నలతో మిగిలిపోయిన మన జీవితానికి, మన ఆశలకు కొత్త రూపాన్ని అందిస్తూ, వాస్తవం ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి వివరిస్తూ, దేనికోసం మనిషి మారుతున్నాడు, దేనికోసం న్యాయాన్ని పాతేస్తున్నారు, అనేది స్పష్టంగా, క్లుప్తంగా మన యువ కవి ఉదయగిరి దస్తగిరి గారి రచనల్లో తారసపడుతుంది, ప్రేమ, బంధం, భవిష్యత్తు, జీవితం,

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అంశంలోనూ దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, దానివలన నువ్వు సాధించగలిగేది , నీకు లభించేది ఏంటి, అని ఎంతో విషదీకరిస్తూ,వాస్తవికంగా ఉంటాయి రచయిత ఆలోచనలు, అక్షరాలు….

 

ఇక కవిత్వం విషయానికి వస్తే

*****

శీర్షిక : ఎవరికి

 

ఎవరికి సన్మానం…!!

కాలాన్ని శాసించే శక్తి తగ్గి

ఈర్ష్యాద్వేషాలతో మకిలి పట్టిన

కవి కలానికా…??

 

పేదవాడి నోటికాడి

ఎంగిలి మెతుకులు లాక్కొని

మేడ మీద మేడ కడుతున్న

రాబంధులకు వత్తాసు పలికే

కాకీలకు,నల్లకోటులకా…??

 

కడుపుకోసం పడుపువృత్తిని

ఎంచుకున్న పవిత్ర భారత నారీమణుల

శీలానికి కాసుల గోడలు కట్టి

కొమ్ము కాస్తున్న సమాజానికా ..??

ఎవరికి సన్మానం…!!

 

నీ మరణానంతరం మహాప్రస్థానానికి

మోసుకెళ్లే ఆ నలుగురికి

ఇప్పుడే వందనాలు చెప్పుకో

నీకోసం నాలుగు కన్నీటి బొట్లని రాల్చడమే

నీకు చేసే అసలైన సన్మానం

 

రుద్రభూమిలో రాజు , బంటు అని

తేడా లేకుండా సమానంగా చూస్తూ

కాలే శరీరాన్ని మోతకర్రతో నిశ్వార్థంగా బాదే

ఆ కాటికాపరికి చెయ్యాలి సన్మానం

అత్తనొక్కడే నిశ్వార్థమైన లోకోత్తముడు

 

కమురు కంపు కొట్టే మనుషుల్ని

బయటకు విసిరేయకుండా

ఎంతో ఔదర్యంతో  ఇసుమంతైనా

బేధం లేకుండా తనలో కలుపుకుని

బాధ విముక్తున్ని చేస్తున్న ఆ శ్మశానానికి

చేయాలి అసలైన సన్మానం..

 

రచయిత : ఉదయగిరి దస్తగిరి

*******

కలం పట్టిన కవికి ఈర్ష ద్వేషాలు పెరిగి, మకిలి పట్టిన వారి మనసులకు చేయాలా సన్మానం..!?

అంటూన్నారు కవి, నిజమే ఒక కవి వాస్తవాన్ని జనుల ముందర పెడతాడు, ఎన్నో రచనలతో పాఠకులను ఆకర్షిస్తారు, స్వచ్ఛంగా, నిర్మలంగా ఉండేవారి మనసులకు ఇప్పుడు ఎందుకు ఈర్షద్వేషాల మబ్బులు కమ్మేసాయి అలాంటి వారికి చేయాలా సన్మానం అంటూ కవి ఎంతో ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు…

 

పేదవాడి నోటికాడి మెతుకులు లాక్కుని, మేడ మీద మేడ కట్టుకుంటూ, రాజకీయ నాయకులు చెప్పే మాటలకు లోబడి,డబ్బు మాయలో పడి, వృత్తిని అవమానిస్తున్న ప్రభుత్వ జీతగాళ్లకు చేయాలా సన్మానం..!? అంటూ మారుతున్న సమాజ భౌతిక స్థితిగతుల మార్పు కోసం కలం కదిలిస్తున్నారు కవి…

 

మూడు పూటలా కడుపు నింపుకోవడం కోసం శీలాన్ని అరువు పెడుతున్న భారత నారీమణులు ఎంచుకున్న ఈ వృత్తికి కాసుల గోడలు కట్టిన సమాజానికి చేయాలా సన్మానం అంటూ భారత స్త్రీ పై జరుగుతున్న అవమానాన్ని ఆపాలన్న ఆకాంక్షతో కవి హృదయం రగిలిపోతుంది…

 

నువ్వు పోయాక నీ పాడే మోసే ఆ నలుగురికి ఇప్పుడే వందనాలు చెప్పుకో, ఎందుకంటే నీకంటూ సంపాదించుకున్నది ఆ నాలుగు చేతులే కదా, నీ కోసం కన్నీటి బొట్లను కార్చే ఆ నలుగురికే నీవు చేయాల్సిన అసలైన సన్మానం అంటున్నారు రచయిత…

 

పాపం చేసినవాడు, పుణ్యం చేసినవాడు, పోయాక ఇద్దరూ స్మశానానికే కదా వెళ్లాల్సింది, ఇద్దరికీ తేడా చూడకుండా పాపపుణ్యాలు లెక్క కట్టకుండా నీ శవాన్ని కాల్చే ఆ కాటి కాపరికి చేయాలి సన్మానం అంటున్నారు రచయిత…

 

నిజమే కదా బంగ్లాల్లో బతికినా, గుడిసెలో బతికినా పోయాక పీనుగు వెళ్లేది స్మశాన వాటికకే, తేడా చూడకుండా తారతమ్యం లేకుండా శవానికి విముక్తి కలిగించేది కాటికాపరే కదా…

 

ఎన్నో తప్పులు చేసే ప్రాణం విడిచిన పినుగులు చమురు కంపు కొడుతున్నా సరే బయటకు విసిరేయకుండా, ఎలాంటి భేదము చూపకుండా తనలో కలుపుకునే ఆ స్మశానానికి చేయాలి కదా అసలైన సన్మానం అంటున్నారు మన రచయిత…

 

నిజమే ఎంత సాధించినా ఎంత పేరు, గౌరవాలు సంపాదించిన పోయాక వెళ్ళేది కాటికి మాత్రమే, నిన్ను నిన్నుగా అంగీకరించి తనలో కలుపుకుంటుంది ఆ మట్టి మాత్రమే అందుకే ఆ స్మశానానికే అసలైన సన్మానం చేయాల్సింది అంటూన్నారు ఈ యువకవి…

 

ఉదయగిరి దస్తగిరి గారు, నిజానిజాలను చూపించడంలో గొప్ప మేధావి, కొట్టి కొట్టనట్టే, గిల్లి గిల్లనట్టే, గిల్లికజ్జాలు ఆడుతూ నొప్పి తాకకుండా, నవ్వుతూ నిజాన్ని చూపిస్తారు, ఆయన రచనలు అన్నీ ఎంతో విప్లవాత్మకంగా ఉంటాయి, ఇలానే ఇంకా ఎన్నో రచనలు చేస్తూ, త్వరలో మరో పుస్తకంతో మా ముందుకు రావాలని, సాహిత్యం పై మీకున్న అభిలాష అంచలంచలుగా పెరగాలని, సాహిత్య శిఖరాన్ని మీరు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…

 

సమీక్షకురాలు : పోలగాని భాను తేజశ్రీ

Related posts

_బాలల దినోత్సవం_ నేటి బాలలే.. రేపటి పౌరులు.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు

Harish Hs

పోటీ!

Dr Suneelkumar Yandra

అబద్ధపు జీవనాలు – మారుతున్న స్థితిగతులు

Dr Suneelkumar Yandra

విస్తరాకు ….. మనిషి జీవితం

TNR NEWS

నిలబడేనా ఇక – రక్త సంబంధాలు

Dr Suneelkumar Yandra

TNR NEWS