- సన్మానించిన జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్
పిఠాపురం : జనసేన అవనిగడ్డ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఏపీ స్టేట్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ లీడర్, పిఠాపురం యువసాహితీవేత్త డాక్టర్ కిలారి గౌరీ నాయుడు విజయవాడ పట్టణంలో ఘన సత్కారం అందుకొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి మరియు గాంధేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, పూర్వ విద్యా శాఖామాత్యులు, సమాజ సేవా పరాయణలు, మచిలీపట్నం మాజీ ఎంపీ, దివంగత మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకొని రామమోహన్ గ్రంథాలయ సంస్థ మరియు కృష్ణాజిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ అటల్ బీహారీ వాజపేయి విజ్ఞాన కేంద్రంలో గురుపూజోత్సవం వేడుకలు నిర్వహించారు. సాహిత్య, సంగీత, సాంస్కృతిక రంగాలలో మాత్రమే కాకుండా గత గత పదిహేను ఏళ్లుగా విద్యారంగానికి గౌరీ నాయుడు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ సత్కారం చేసినట్లు కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు తెలిపారు. విద్యార్థులకు విద్యను బోధించడం మాత్రమే కాకుండా క్రమశిక్షణ, అంకితభావం, కష్టపడే తత్వం, నిజాయితీ, పరస్పర సహకారం వంటి గొప్ప లక్షణాలను విద్యార్థులలో పెంపొందించి భావి భారత పౌరులను తయారు చేయడంలో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని సదస్సు కన్వీనర్ డాక్టర్ జీవి పూర్ణచంద్ గౌరీ నాయుడు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరీ నాయుడు మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యా విధానాల మారుతున్నాయి, సాంకేతిక విద్య అందరికీ అందుబాటులోకి వచ్చిన నేటి కాలంలో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి అనే లక్ష్యంతో విద్యారంగ అధ్యాపకులు, ఉపాధ్యాయులు పనిచేయాలని గౌరీ నాయుడు సూచన చేశారు. దివిసీమ గాంధీ, తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికి విశేషమైన సేవలను అందించిన మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సభలో సత్కారం జరగడం జీవితంలో మరుపురాని అరుదైన సత్కారంగా పరిగణించ బడుతుందని గౌరీ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అధికారభాష సంఘానికి మండల వెంకటకృష్ణారావు పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా సాహిత్య సంస్థల పక్షాన గౌరీ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్స్ లర్, విద్యావేత్త ప్రొఫెసర్ వియన్నారావు, రామమోహన్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కోటేశ్వరరావు, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గౌరవ ఆచార్యులు ఎం.సి.దాస్ తదితరులు గౌరీ నాయుడునీ అభినందించి ఘనంగా సత్కరించారు.