పూల మకరందమే సుమగంధమైతే
సరసన నిలిచిన నీ జత ప్రియ నందనమైతే
వలపులపూతోటలు వికసించి పోవా
విరిసిన నవ కుసుమాలు పరిమళించిపోవా
ఎద మాటున దాగిన మాట వినిపించే క్షణాన
విశ్వమంతటా మన జ్ఞాపకాలే
విస్తుపోక క్షణక్షణం ప్రేమ పోరాటాలే…
కవిత్వం ఒక జ్ఞాపకాల భాండాగారం
కవిత్వం కరగని కన్నీటి కావ్యం కవిత్వం కర్షకుడి అసంపూర్ణ జీవం
కవిత్వం కనురెప్పలా కాచే అమ్మ జీవితం
కవిత్వం భావాలను దాచుంచే ప్రణయ శబ్దం
కవిత్వం వర్ణించలేని, వర్ణనకే అందని ఓ మధుర భావం
అంటూ కవిత్వం గురించి, కవనాన్ని వర్ణించడం గురించి, ఒక కవిత్వం అంటే ఏమిటి అని ఆరాధించే అతని అక్షరాలే అర్థంగా నిలుచున్నాయి, సురేందర్ గారి కవిత్వం ఎంతో సుందరంగా, స్పష్టంగా, అర్థవంతంగా ఉందనడంలో అతిశయోక్తి లేదని చెప్పాలి.
- ఇక కవిత్వం విషయానికి వస్తే…
- శీర్షిక : కవిత్వం తప్ప
నేనేమీ ఇవ్వగలను
చేతులతో..!
నేనేమీ చెప్పగలను
మాటలతో..!
ఓ ప్రేమ కావ్యాన్ని మీ పచ్చని వాకిట్లో
ముత్యాల ముగ్గులతో నింపడం తప్ప..!!
నేనేమి చూడగలను
కనులతో..!
నేనేమి శ్వాసించగలను
ఊపిరితో..!
ఓ మాధుర్యమైన భావాల్ని కలబోసిన కావ్యాన్ని
నీ హృదయ సంద్రంలో
ప్రేమ కవిత్వమై రాయడం తప్ప..!!
- రచయిత : డా. పగిడిపల్లి సురేందర్
- సమీక్ష
నేనేమీ ఇవ్వగలను చేతులతో, నేనేమి చెప్పగలను మాటలతో, ఓ ప్రేమ కావ్యాన్ని మీ పచ్చని వాకిట్లో ముత్యాల ముగ్గులతో నింపడం తప్ప…
అర్థవంతమైన భావాలకు ప్రతీక అని చెప్పాలా
లేక అర్ధాన్ని నింపుకున్న అక్షరాల హరివిల్లు అని వర్ణించాలా
చేతులతో ఇవ్వలేనిది, మాటలతో చెప్పలేనిది
ప్రేమ కావ్యం గా మారి ముత్యాలముగ్గులో స్పష్టంగా కనిపిస్తుంది వహ్వా ఏమి వర్ణన
మనసుకి ఉత్తేజాన్ని ఇస్తూ, మనసైన వారి జ్ఞాపకాలకు రూపంగా నిలిచిపోతున్నాయి ఈ భావాలు, మధురమైన అక్షర కావ్యాలు…
నేనేమి చూడగలను కనులతో, నేనేమి శ్వాసించగలను ఊపిరితో, మాధుర్యమైన భావాల్ని కలబోసి కావ్యాన్ని నీ హృదయ సంద్రంలో ప్రేమ కవిత్వమై రాయడం తప్ప అంటూ
భావావేశాన్ని గుండెల్లో దాచుకుని, మధురమైన, మాధుర్యమైన తలపుల వలపులతో హృదిని కోమలంగా తాకుతున్న ప్రేమ కవిత్వాన్ని తప్ప ఇంకేమీ ఇవ్వగలను బహుమతిగా
కన్నులతో చూడలేనిది
చేతితో తాకలేనిది అందమైన నీ హృదయమే కదా, నన్ను నీలో నింపుకున్న మృదు మధురమైన ఆ అంతరంగమే కదా….
ఒక్కొక్క అక్షరం అమృతమై కురుస్తుంది
ఒక్కొక్క పదం మనసుని తాకి మైమరపిస్తుంది
ఒక్కొక్క వాక్యం విశిష్టమైన అర్ధాన్ని పులుముకుని కనుల ముందు సాక్షాత్కరిస్తుంది.
ఇలాంటి మరెన్నో మనసుకు హత్తుకునే కవనాలు మీరు లిఖించాలని, అనంతమైన ఈ సాహిత్య లోకానికి దిక్సూచిగా మీ అక్షరాలు మారాలని, మరెన్నో రచనలు చేసి పాఠకుల మనసులు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
- సమీక్ష : పోలగాని భాను తేజశ్రీ
