పిఠాపురం పిఠాపురం మండలం, విరవాడ గ్రామానికి చెందిన దర్శకుడు ఎం.వి.సతీష్ కుమార్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో నిర్వహించిన 7వ అంతర్జాతీయ సంస్కృత లఘు చలనచిత్రోత్సవం–2026లో ఆయన దర్శకత్వంలో రూపొందిన సంస్కృత షార్ట్ ఫిల్మ్ అస్తేయంకు ద్వితీయ స్థానం లభించింది. ఉజ్జయినిలోని విక్రమాదిత్య భవన్‌లో జరిగిన ఈ ఉత్సవాన్ని సంస్కృత భారతి నిర్వహించింది. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పాటు అమెరికా నుంచి కూడా పాల్గొనడం విశేషం. మొత్తం 90 ఎంట్రీలు రాగా, అందులో 20 రీల్స్ విభాగంకు చెందినవి. వివిధ విభాగాల్లో 30 బహుమతులు ప్రదానం చేశారు. సంపూర్ణంగా సంస్కృత భాషలో రూపొందిన “అస్తేయం” చిత్రం కథా ప్రవాహం, భావవ్యక్తీకరణ, సంస్కృత భాషను సులభంగా ప్రజలకు చేరువ చేసే విధానంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. అంతర్జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించడం ద్వారా ఈ చిత్రం మాత్రమే కాకుండా, దర్శకుడి స్వగ్రామం విరవాడ పేరు కూడా జాతీయ స్థాయిలో వినిపించింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు బాలయోగి ఉమేశ్‌నాథ్ మహారాజ్ మాట్లాడుతూ భారతీయ భాషలు, సంస్కృతి పరిరక్షణకు ఇలాంటి ఉత్సవాలు అవసరమని, ముఖ్యంగా సంస్కృతాన్ని కొత్త తరానికి చేరవేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నటి ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ సంస్కృతం క్లిష్టమైన భాష అన్న అపోహ తప్పని, సరైన విధానంలో అందిస్తే ఎవరైనా నేర్చుకుని ఆస్వాదించగలరని వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో నటించిన కె. లలితకు ఉత్తమ నటి అవార్డు లభించడం మరో విశేషం. చిత్రాన్ని ఏకదంత నిర్మాణ సంస్థ నిర్మించగా, నిర్మాతగా మేడూరి విష్ణు వర్ధన్ రెడ్డి వ్యవహరించారు. రచన సహకారం ఆచార్య సి.హెచ్. సద్గుణ అందించారు. గతంలో కూడా అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులు అందుకున్న ఎం.వి.సతీష్ కుమార్, హైదరాబాద్ కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తూ ఖర్జూరం, మిక్చర్ పొట్లం వంటి చిత్రాలతో పాటు మొత్తం నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఏకదంత – ద స్కూల్ ఆఫ్ ఏన్షియంట్ స్టడీస్ సంస్థకు ఫౌండర్ & డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. విరవాడ గ్రామానికి చెందిన ఓ దర్శకుడు సంస్కృత సినిమాతో అంతర్జాతీయ వేదికపై నిలవడం పిఠాపురం మండలానికి గర్వకారణమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
