February 4, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తెలంగాణ

సంక్రాంతి విశిష్టత ఏమిటి.. పెద్ద పండుగ ఎలా అయ్యింది !

ఖగోళశాస్త్ర రీత్యా… ప్రకృతిలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అనుసరించవలసిన విధి విధానాలకు మన పూర్వ ఋషులు పండుగల రూపంలో దిశానిర్దేశం చేశారు. ఈ విధి విధానాలన్నీ మనిషి వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, సామాజికమైన ప్రయోజనాలనూ, సంక్షేమాన్నీ కాక్షించేవే! ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక, సాంఘిక, ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానాలలో ఉన్నత శిఖరాలను అందుకోవడానికి ఉద్దేశించిన ఈ పండుగలు బహుళార్థ సాధకాలు. ఆయా ఋతువులలో, సంక్రమణాల్లో ఎలా మసలుకోవాలో, ఆ వాతావరణాలను ఎలా సమన్వయించుకోవాలో వీటి ద్వారా పూర్వులు తెలియజేశారు.సూర్యుడు ధనురాశి నుంచి మకరరాశిలో ప్రవేశించడం మకర సంక్రమణంగా, మకర సంక్రాంతిగా ప్రసిద్ధి పొందింది. ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరాభిముఖంగా పయనిస్తాడు. దీన్ని ఉత్తరాయన పుణ్యకాలంగా పరిగణిస్తారు. దేశవాసులందరూ వారి వారి సంప్రదాయాలను అనుసరించి దీన్ని ప్రత్యేక పర్వంగా నిర్వహించుకుంటారు. ఉత్తరాయనంలో తెలుగువారు జరుపుకొనే ప్రముఖమైన తొలి పండుగ సంక్రాంతి. జీవిక కోసం ఎవరు ఎక్కడెక్కడ ఉన్నా… సంక్రాంతి నాటికి తమ ఇళ్ళకు చేరి, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ ఆధునిక కాలంలో కూడా సంక్రాంతి శోభను చూడాలంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలి. తరాలు మారినా, ప్రపంచం సాంకేతికంగా వృద్ధి చెందినా.. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలు పల్లెల్లో జీవించి ఉండడం చెప్పుకోదగిన విషయం. పౌష్య లక్ష్మికి స్వాగతం పలికే సంక్రాంతిని గతంలో ‘పెద్ద(ల) పండుగ’ అని పిలిచేవారు. వ్యవసాయమే జీవనాధారమైన కర్షకుల ఇళ్ళకు పంటలన్నీ సంక్రాంతి నాటికి చేరుకుంటాయి. ప్రకృతి పచ్చగా, శోభాయమానంగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కర్షకులకు, వారి కష్టానికి సాయపడిన పశుగణానికి ఇది విశ్రాంతి సమయం. సంక్రాంతి… ‘భోగి, సంక్రాంతి, కనుమ’ అనే మూడు రోజుల పండుగ. వాస్తవానికి సంక్రాంతి శోభ ముప్ఫై రోజుల ముందు నుంచే కనువిందు చేస్తుంది. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించి, మకరరాశికి చేరుకొనే ముప్ఫై రోజులను ‘ధనుర్మాసం’ అంటారు. ‘నెల పట్టడం’ అని కూడా వ్యవహరిస్తారు. గృహిణులు ఉషోదయానికి ముందే ఇళ్ళ ముందు ఆవు పేడతో కళ్ళాపి చల్లి, అందంగా రంగవల్లికలను తీర్చిదిద్దుతారు. వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి, అవి కంటికి ఇంపుగా కనబడేలా బంతి, చామంతి, గుమ్మడి పూలతో అలంకరించి… వాటి చుట్టూ తిరుగుతూ, చప్పట్లు కొట్టి పాటలు పాడుతారు. ధనుర్మాసంలో పల్లెల్లో కనువిందు చేసే హరిదాసులు, గంగిరెద్దులు ఆడించేవారు, జంగమయ్యలు, బుడబుడక్కులవారు, పగటి వేషధారులు తదితర జానపద కళాకారులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. 

                హరీష్ TNR news reporter

Related posts

కన్నుల పండువగా అయ్యప్ప మహా పడిపూజ

TNR NEWS

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం. గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 23 ఫిర్యాదులు స్వీకరణ. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

TNR NEWS

జిల్లాలో గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

Harish Hs

దైవత్వాన్ని పరిచయం చేసే త్రైత సిద్ధాంత భగవద్గీత

TNR NEWS

నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్న జిల్లా గ్రంధాలయం.. జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ వంగవీటి రామారావు…  

TNR NEWS

*నేడు ఎక్సైజ్ స్టేషన్‌లో ద్విచక్ర వాహనాల వేలం పాట*

TNR NEWS