పాతికేళ్లు ఒంటిమీద పడగానే అబ్బాయిని
పెద్దమనిషి అవ్వగానే అమ్మాయిని
పదండి పదండి అంటూ పెళ్లి పీటలెక్కించేస్తారు ఇరుగుపొరుగు వారు
కన్నవారికి లేని ఇబ్బంది బందు – రాబంధువులకు వచ్చింది
ఇరుగుపొరుగు జనాలకు ఆత్రం ముంచుకొచ్చింది
ముప్పూటలా కడుపు నింపగలడా లేదా అని అవసరం లేదు
పిల్ల చేతికొచ్చింది చాలు – అర్థం చేసుకునే ఆలోచన మెదడులో పెరిగిందా లేదా అనేది అవసరం లేదు
ముద్దుగా ముస్తాబులు చేసి ఫోటోలకు ఫోజులు ఇవ్వమంటున్నారు
కొంతకాలం గడిచాక ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎదురైతే మాకెందుకు అని ముఖం చాటేస్తారు
గిల్లికజ్జాలు ఆడుతూ పెళ్లి భోజనాలు చేస్తారు చుట్టాలు
భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు కాస్తా కొట్టుకునేంతవరకు వెళితే
తొంగి కూడా చూడరు పెళ్లి చేసిన పెద్ద ముత్తైదువులు
పెళ్లిని ఆర్భాటంలా చూస్తున్నారు
పెళ్లి చేసి బరువు దించాలని ఆశిస్తున్నారు
పెళ్లి వయసు వస్తే సరిపోతుందా – ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే ఓర్పు సహనం అవసరం లేదా
వంశాన్ని అభివృద్ధి చేయడానికి పెళ్లి చేస్తే సరిపోతుందా – అర్థం చేసుకుని ఒకరికి ఒకరు పోయేంతవరకు తోడుగా ఉండాలని ఎవరూ నేర్పడం లేదే
అవకాశం ఉందని కొందరు, అజాగ్రత్తతో మరికొందరు
బరువు దించుకుందామని కొందరు, బంధువుల మాటలు విని మరికొందరు
దయచేసి పెళ్లిని ఇరువురు అంగీకరించినప్పుడే చేయండి,
ఎదురయ్యే సమస్యలను వారు పరిష్కరించుకోగలము అన్నపుడే ముందడుగు వేయండి,
చిన్న వయసులో పెళ్లిళ్లు చేసి జీవితాలు నాశనం చేయకండి,
చిన్న వయసులో పెళ్లిళ్లు చేసి
బిడ్డల ఆకాశమంత జీవితాన్ని పాతేయకండి…
*****
పోలగాని భాను తేజశ్రీ
కవి, రచయిత్రి
కృష్ణాజిల్లా