పిఠాపురం : పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) తాత్కాలిక భవన ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న పాడా కార్యాలయ పనులను గురువారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులతో కలిసి పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం పరిధిలోని ప్రాంతాల అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు. పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ఇందుకు ప్రత్యేక అధికారులను నియమించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. పాడా అధికారులు పనుల పర్యవేక్షించేందుకుగాను పిఠాపురంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో పాడా కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పనులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట పాడా ఇంచార్జ్ పీడీ ఎన్.శ్రీధర్ బాబు, ఏపీడీ పి.వసంత మాధవి, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఇతర ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
