- నామమాత్రంగా హోమం
- – ధరలు ఫుల్…. సౌకర్యాలు నిల్…
అయినవిల్లి : కోరిన కోర్కెలు తీర్చే గణపతిగా అయినవిల్లి గణపతి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ దైవం వినాయకుని సాక్షిగా భక్తులను దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరికలు తీర్చేస్వామిగా అయినవిల్లి విఘ్నేశ్వరుడు ఖ్యాతి పొందారు. ఈ ప్రసిద్ధ ఆలయంలో భక్తులు తమ ఈతిబాధలు తీరి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఇక్కడ జరిగే శ్రీలక్ష్మిగణపతి హెూమంలో పాల్గొంటారు. ఇటువంటి మహిమాన్విత గణపతి హోమం ధరను ఇష్టానుసారం పెంచుకుంటూపోవడంతో భగవంతుడిని భక్తులకు దూరంచేస్తున్న వైనంగా మారింది. ఈ ఆలయంలో గణపతిహోమం రూ.200 చెల్లిస్తే దేవస్థానం వారే అన్ని సదుపాయాలు కల్పించేవారు. మొదట్లో కేవలం ఆదివారాలు మాత్రమే ఉదయం 11గంటల నుంచి హెూమం ప్రారంభించేవారు. తదుపరి గణపతి హెూమం ధరను రూ.300 పెంచడంతోపాటు వారంలో అన్నిరోజులు జరిగేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. క్రమేపీ గణపతి హెూమం రోజురోజుకు పెరుగుతున్న భక్తులను దృష్టిలో వుంచుకుని టికెట్ ధరను రూ.500కి పెంచడం గమనార్హం. టికెట్ చెల్లించిన భక్తులు న్వయంగా పూజలో కూర్చునే అవకాశం ఉందని ప్రచారం చేశారు. సాధారణంగా శ్రీలక్ష్మిగణపతి హోమాన్ని వైదిక సంప్రదాయబద్ధంగా నిర్వహించే విధానంలో స్వామివారికి క్షీరాన్నం, తామరపూలు, ఉండ్రాళ్లు, చెరకుముక్కలు, బెల్లంముక్కలు, వెలగపండ్లు, అటుకులు, పేలాలు, గరికపత్రి, సుగంధ ద్రవ్యాలు, ఆవునెయ్యి వినియోగిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో హెూమ కార్యక్రమాన్ని ఆలయ పూజారులు ఆధ్వర్యంలో పూర్తి చేసేవారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సకల కార్యములందు విజయం, పనులు త్వరితగతిన పూర్తవడం, పరీక్షలయందు విజయం, ఉద్యోగప్రాప్తి, ఈతిబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అతి కొద్దినెలల కాలంలోనే లక్ష్మీగణపతి హోమం టికెట్ ధరను రూ.500 నుంచి రూ.1,116కు పెంచడం దేనికి సంకేతమో ఆలయ అధికారులకే ఎరుక. ఈ హోమంలో పాల్గొన్న భక్తులకు కేవలం పూర్ణాహుతి సమయంలో ఒక కురిడి, రెండు కొబ్బరికాయలు, దర్శనానంతరం ఒక రవ్వలడ్డూ, విభూతి ప్యాకెట్ ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా దాతలు ఏదైనా పుస్తకాలు ప్రచురించి ఇస్తే మాత్రం అవి పంచిపెట్టడం రివాజు. సాధారణంగా రూ.1000 పైబడి వసూలు చేసే పూజల్లో మన ప్రసిద్ధ దేవాలయాలైన తిరుపతిలో స్వామివారి కల్యాణం చేయిస్తే కండువా, జాకెట్ తో పాటు రెండు లడ్లు భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. శ్రీశైలం, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో సైతం స్వామివారి పేరుతోవున్న కండువా, చీర, ప్రసాదం అందిస్తారు. కానీ అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వరస్వామి వారి దేవస్థానంలో మాత్రం భక్తులనుంచి పూజా టికెట్ల ధరలు పెంచుకుంటూ ధనార్జ నే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. అంతేకాకుండా గణపతి హెూమం చేసే సమయంలో తూతూ మంత్రంగా హెూమ ద్రవ్యాలు వినియోగిస్తూ కార్యక్రమాన్ని మమ అనిపిస్తున్నారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. వచ్చేది వేసవి కావడంతో ఆలయంలో దర్శనానికి వచ్చే భక్తులు ఎండకు తమ కాళ్లు మాడిపోతున్నాయని వాపోతున్నారు. కనీసం ఆలయ ప్రాంగణంలో కూల్ పెయింట్ కూడా దేవస్థానం అధికారులు వేయించలేని దుస్థితి. భక్తుల విరాళాల కోసమే తప్ప… సౌకర్యాల కల్పనలో ఆలయ కార్య నిర్వహణాధికారి ఏమాత్రం శ్రద్ద వహించడంలేదని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఆకస్మాత్తుగా లక్ష్మిగణపతి హెూమం టికెట్ ధరను పెంచడంతోపాటు, ఆలయంలో కల్పించాల్సిన సౌకర్యాలపై ఆలయ ఈవోను వివరణకోరగా ఈ ధరలు రెండేళ్ల క్రితమే పెంచేశామని చెప్పడం కొసమెరుపు. గతంలొ రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో భక్తులు బయటనుంచి స్వామివారిని దర్శనం చేసుకునేలా ఆలయం బయట గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ విగ్రహాన్ని ప్రస్తుత ఈవో అక్కడనుంచి తొలగింపచేయడం కొసమెరుపు. ఈ ఉదంతంపై భక్తులు పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇకనైనా భక్తుల మనోభావాలు గండికొడుతున్న ఇటువంటి చర్యలపై దేవదాయశాఖ అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.