క్రైస్తవ ప్రబోధకుడు, గ్రంథాల పరిశోధకుడిగా పేరొంది హైదరాబాద్ నగర కేంద్రంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా సువార్తికుడిగా పని చేస్తున్న పగడాల ప్రవీణ్ మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో రాజమండ్రి సమీపంలో మరణించడం క్రైస్తవ లోకానికి తీరని లోటని కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ డాక్టర్ కె. శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణ కేంద్రంలో ప్రధాన కూడలి అయిన వై.జంక్షన్ లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ కె. శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రవీణ్ పగడాల మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు గాని ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇది మతఛాందసవాదులు చేసిన కుట్రలో భాగమేనని ఆయన దుయబట్టారు. పగడాల ప్రవీణ్ మృతిపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు సమగ్ర విచారణ జరిపి, ప్రవీణ్ హత్యకు కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిణామాలు మరల పునరావృతం కాకుండా రాష్ట్రంలో క్రైస్తవ మందిరాలకు క్రైస్తవ పాస్టర్లకు తగు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. జోసఫ్, జిల్లా క్రైస్తవ మీడియా కన్వీనర్ జె జె శామ్యూల్ సన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్ నాయకులు పంది తిరుపతయ్య, గుండెపొంగు రమేష్, పి. పాల్ చారి, షేక్ కొర్నేలి బాబు, రాము జెకర్యా, రామారావు, దానియేలు, శామ్యూల్ పీటర్, సైమన్, రాజేష్, ఆమోసు, గాబ్రియేలు ఆయా మండలాల క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు.