- పిఠాపురం ప్రభుత్వాసుపత్రి సూపరిండెండెంట్ డా పి.సుజాత
పిఠాపురం : గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ పి.సుజాత అన్నారు. ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు సమయానికి ఆహారం తీసుకోవాలని, ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నందున తగినంత మంచినీరు, లేదా ఇతర సూచింపబడిన పానీయాలు తీసుకోవాలని అన్నారు. సాధారణ డెలివరీలు ఎక్కువగా అయ్యే విధంగా ప్రభుత్వాసుపత్రి తమ వంతు ప్రయత్నాలు చేస్తుందని, ఇప్పటి వరకు పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో సాధారణ డెలివరీల శాతం ఎక్కువగా నమోదు చేయడం జరిగిందన్నారు. గర్భిణీ స్త్రీలు ఎల్లప్పుడూ చురుకుదనంతో ఉండాలని, తమ పనులు తామే చేసుకోవాలని తద్వారా కాన్పు సులభం అవుతుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు నెలకి 150 నుండి 180 వరకు డెలివరీలు అవుతున్నాయని, వీటిలో దాదాపు అన్ని సాధారణ డెలివరీలు జరుగుతున్నాయన్నారు. పిఠాపురం నియోజవర్గం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో నమ్మకంతో గర్భిణీ స్త్రీలు డెలివరీల కోసం వస్తున్నారని, ఇక్కడ తాము అందిస్తున్న చికిత్స మరియు వైద్య విధానంలో తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఆసుపత్రి పై వారికి నమ్మకం పెంచుతున్నాయని తెలిపారు. తద్వారా సిజేరియన్ శాతం తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మరియు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.