Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ప్రత్యేక కథనం

ఆత్మలింగాత్మకమ్..! అమర లింగా త్మకమ్…!!

నేను పంచభూతములతో కూడిన శరీరాన్ని కాను! ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమును కాను! నాకు సుఖదుఃఖాలు, పాపపుణ్యములు, అరిషడ్వార్గాలు, ఈషణత్రయాలు, పురుషార్ధాలు లేవు! నేను తెలుసుకోవలసింది, పొందవలసింది ఏమి లేదు! నేను సచ్చిదానంద స్వరూపుడైన శివుడను! శివుడను తప్పా వేరేమీ కాను!! అని ఉపనిషత్తుల సారాంశమంత తన నిర్వాణషట్కము / ఆత్మషట్కము లో తేల్చి చెప్పేసేరు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు.

 

అంతేకాదు ప్రతిజీవుడు సచ్చిదానంద శివస్వరూపుడే! ఆ సత్యాన్ని గ్రహించాలంటే ఆత్మభావంతో సాధనచెయ్యాలని, అప్పుడే తన నిజస్వరూపం బోధపడుతుందని సూచించేరు జగద్గురువు. ఇక సాధన మనచేతుల్లో వుంది.

 

జీవాత్మకి, పరమాత్మకి ఉపాధి విషయంలో బేధం వున్నప్పటికీ, ఇరువురిలో చైతన్యాంశ (ఆత్మస్వరూపము) మాత్రం ఒక్కటే! అది సత్యము!!

 

ఎవరైతే అన్ని జీవులను ఆత్మలోనూ, ఆత్మను అన్ని జీవులలోనూ చూస్తారో వారికి యెవ్వరియందు ద్వేషభావం వుండదు. ఆత్మే అన్ని జీవరాసులుగా వున్నదని గ్రహించిన వ్యక్తికి మోహం, శోకం ఎలా వుంటాయి? ఆత్మానుభూతి పొందిన వ్యక్తి, విశ్వమంతటిని ఆత్మస్వరూపంగా చూస్తాడు. అతనికి ఆత్మ తప్ప ప్రపంచములో వేరేది కనిపించదు. ఏదైనా రెండవ వస్తువు ఉన్నప్పుడు మాత్రమే కదా మనకు దానిపైన మనసుపోయేది. అంతా ఒకటే అయినప్పుడు మనసు ఎక్కడకు పోగలదు. ఒక్కచోటే వుంటుంది. అందువలన బాధగాని, మోహంగాని, ద్వేషంగాని కలగవు.

 

ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కారం మొదలగునవి ఆంతరంగిక అనుభవాలు. బయటి ప్రపంచం ఎప్పటిలానే ఉంటుంది. చూసేవాడి మనసును బట్టీ, వ్యక్తివ్యక్తికీ ప్రపంచస్వభావం వేరేలా ఉంటుంది. ఒక యువకుడికి ఏదైనా సాధించగలననే విశ్వాసం ఉంటుంది. అదే ఒక ముసలివ్యక్తికి అంతా అయిపోయిందనే భావన ఉంటుంది. ప్రపంచం ఏమీ మారలేదు. మార్పంతా చూసేవాడిని బట్టే వుంటుంది. అందుకే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తియొక్క మనసు విశాలమై విశ్వమంతటితోనూ ఏకం అవుతుంది.

 

అతడు అన్నింటి అంతరార్థాన్నీ గ్రహిస్తాడు. అందున్న జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అతడు మాత్రమే నిజమైన మనీషి. మనీషి అంటే మనసును వశం చేసుకొన్నవాడు అని అర్థం. మనసు చెప్పినట్లు అతడు ఆడడు, అతడు చెప్పినట్లు మనసు ఆడుతుంది. ఆత్మానుభూతి పొందినవాడికి తెలుసుకోవలసింది ఏమీ లేకపోవడం వలన అతడు నిత్యతృప్తుడై ఉంటాడు. అతడు కేవలం ఆత్మ / పరమాత్మనే విశ్వసిస్తాడు. వస్తువుల నిజమైన తత్వాన్ని తెలుసుకొన్నవాడు కాబట్టి దేనికీ లొంగడు.

 

ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది కాబట్టీ, అది అందరికీ చాలా దగ్గరగా ఉందన్నమాట, కాని ఈ విషయాన్ని అనుభవపూర్వకముగా తెలుసుకోలేనప్పుడు అది మనకు దూరంగా వుంటుందని అర్థం. ఆత్మగా అది మనలో వుండి, పరమాత్మగా మన బయట ఉందన్న విషయాన్ని మనమందరం స్పష్టంగా అర్థంచేసుకోవాలి.

Related posts

ప్రేమ పరీక్ష

కార్తీక పౌర్ణమి – జ్వాలా తోరణ మహత్యం

TNR NEWS

తీర్చలేని ఋణం

TNR NEWS

తొర్రూర్ బస్టాండ్ ఆవరణంలో ఆర్టీసీ విజయోత్సవాలు  బస్టాండ్ లోపల సిసి కెమెరాలు లేని వైనం  విజయోత్సవాలు కాదు అభివృద్ధి కావాలి  విజయోత్సవాలు ఫ్లెక్సీల పై కాదు 

TNR NEWS

ఎవరికి చేయాలి సన్మానం..!?

Dr Suneelkumar Yandra

TNR NEWS