రాష్ట్రంలో అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకొని, అధిక ఫీజుల వసూళ్లను నియంత్రిచాలని, విద్యా హక్కు చట్టం తక్షణమే అమలు చేసి ప్రైవేట్ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈఓ) సుసింద్ర రావ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులతోపాటు డొనేషన్లు, వార్షిక ఫీజులు, స్కూల్ డ్రెస్లు, పుస్తకాలు వంటివి బలవంతంగా అంటగట్టి దోపిడీకి గురిచేస్తున్నారని తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని తీవ్ర ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. సకాలంలో ఫీజులు చెల్లించలేకపోతే స్కూళ్ల నుంచి వెళ్లగొట్టడం, హాల్ టికెట్లు, టీసీలు ఇవ్వక పోవడం వంటి దుర్మార్గపు చర్యల కు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యా హక్కు చట్టం సమర్థవంతంగా ఎందుకు అమలు చేయడంలేదని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులను నియంత్రించాలని, విద్య హక్కు చట్టం అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చింతల రాఘవేందర్ ముదిరాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ దిలీప్ రావ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపీనాథ్ కట్టెకోల, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వంటెపాక శ్రవణ్ కుమార్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మల్లం శ్రీనివాస్, ముచర్ల మల్లేశ్, రంగారెడ్డి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు రామగళ్ల శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శులు మాధగోని సత్యం, ప్రవీణ్, మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిపిజె శ్రీధరన్ తదితరులు పాల్గొన్నారు.
