హైదరాబాద్ : శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం హైదరాబాద్ శాఖ ఘట్టుపల్లి ఆశ్రమంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆశ్రమం నవమ పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో చిన్నారులకు నిర్వహించే తాత్విక బాలవికాస్ కార్యక్రమ విద్యార్థులు శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడు, గోపికల వేషధారణలో భగవద్గీత శ్లోకాలు పాడి వినిపించారు. కృష్ణునికి సంబంధించిన గీతాలు, చక్కటి సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. చిన్నారి అభినవ్ చంద్రక్ కృష్ణతత్వాన్ని చక్కగా అభివర్ణించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన శ్రీ కృష్ణుని లీలలు నాటకం చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులందరికీ స్వామి శుభాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆశ్రమంలో చిన్నారులు ఆలపించిన గీతాలు, ప్రదర్శించిన నృత్యాలు, నాటకాలు ఎంతగానో మంత్రముగ్ధులు చేశాయని ఆయన అన్నారు. కృష్ణుడు ఒక యుగ పురుషుడని, అపార మేధో సంపద కల్గి ఉన్నత విలువలతో కొనసాగిన వ్యక్తి అని, భగవద్గీతతో ఎంతో మందికి దారి చూపించిన గురువుని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆశ్రమ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.