- అధ్యాపకుల సమస్యలపై జనసేన హామీని అమలు చేయాలని విజ్ఞప్తి
పిఠాపురం : భీమవరం జనసేన ఎమ్మెల్యే, ఏపీ స్టేట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులుని ఏపీ స్టేట్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ లీడర్, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్, గ్రంథాలయ సేవా సంస్థ కన్వీనర్, పిఠాపురం పట్టణానికి చెందిన డాక్టర్ కిలారి గౌరీ నాయుడు భీమవరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల సమస్యలపై ఎమ్మెల్యే రామాంజనేయులుతో చర్చించారు. ఎన్నికలకు ముందు జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యను పరిష్కరిస్తానని గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నెరవేర్చడంలో జరుగుతున్న జాప్యాన్ని నిలువరించి అధ్యాపకులకు న్యాయం చేయాలని గౌరీ నాయుడు విన్నవించారు. రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వేతనాలు విషయంలో అతిథి అధ్యాపకులు చాలా తక్కువ స్థాయిలో వేతనాలు పొందుతున్నారని తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో మాట్లాడి అధ్యాపకుల సర్వీస్ ను కాంట్రాక్ట్ వ్యవస్థలోకి క్రమబద్ధీకరణ చేసేలాగా కృషి చేయాలని గౌరీ నాయుడు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం, కాకినాడ, విశాఖపట్నం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిమిత్తం పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంలో వ్యక్తిగతంగా కలిసి మాట్లాడటం జరిగిందని గౌరీ నాయుడు గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా చొరవ తీసుకొని మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని, సర్వీస్ రెన్యువల్ ఆర్డర్ వచ్చేలాగా విద్యాశాఖ, ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడతానని రామాంజనేయులు హామీ ఇచ్చినట్లు గౌరీ నాయుడు పేర్కొన్నారు.