గొల్లప్రోలు : యూరియా దొరకదని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రం లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ రైతులకు తెలిపారు. గొల్లప్రోలు సొసైటీ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో వర్మ రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు. ఒక్కొక్క రైతుకు 2 బస్తాలు చొప్పున అందజేసారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు షాపులలో ఎరువులు బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయించే వారని, కూటమి ప్రభుత్వంలో రైతు సేవా కేంద్రాలు, సొసైటీల ద్వారా అసలు ధరకే యూరియా అందజేస్తున్నామని తెలిపారు. రైతులు అందరికీ యూరియా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కాగా ఇప్పటివరకు వచ్చిన యూరియాను సక్రమంగా పంపిణీ చేయకపోవడం పై సొసైటీ కార్యదర్శి ఆదిరెడ్డి సూరిబాబు పై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా వచ్చిన వెంటనే తనకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం వ్యవసాయ శాఖ ఎడి స్వాతి, మండల వ్యవసాయాధికారి కె.వి.వి.సత్యనారాయణ, వ్యవసాయ శాఖ సిబ్బంది అపర్ణ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.