సూర్యాపేట: పత్తి దిగుమతులపై 50 శాతం పన్ను విధించాలని, కేంద్ర ప్రభుత్వం పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని తొలగిస్తూ విడుదల చేసిన నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, అఖిలభారత వ్యవసాయ కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వరికుప్పల వెంకన్న డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు పత్తి దిగుమతులపై 11 శాతం పన్ను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తి దిగుమతులపై ఉన్న 11 శాతం ఉన్న పన్నును రద్దు చేయడం వల్ల రైతాంగాన్ని కష్టాల్లోకి నెట్టడమేనని అన్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెట్ లో మద్దతు ధరలు లేక దళారులకు తమ ఉత్పత్తులను కారు చౌకగా అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా పెట్టిన పెట్టుబడులు చేతికి రాక దేశ రైతాంగం అప్పుల్లో కోరుక పోతుందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి దేశ రైతాంగానికి అనుకూల విధానాలను రూపొందించి అమలు చేస్తామని ప్రకటించిన మూడు రోజులకే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలకు లొంగి ఆగస్టు 19న పత్తి దిగుమతులపై ఉన్న 11శాతం సుంకాన్ని రద్దు చేస్తూ పెట్టుబడిదారి దేశాల దిగుమతులకు ఎర్ర తివాచి ఆహ్వానించడం సిగ్గుచేటు అన్నారు. రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందించడం లేదన్నారు. పంట పెట్టుబడి పై 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయిస్తామన్న కేంద్ర ప్రభుత్వం హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు.
రైతుల అన్ని రకాల పంట రుణాలను మాఫీ చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలన్నారు. సంవత్సరానికి ₹200 రోజులు పని దినాలు కల్పించి రోజు కూలి 600 ఇవ్వాలన్నారు. పత్తి కింటాకు10,075 కనీస మద్దతు ధర నిర్ణయించి, నిర్ణయించిన ధర సేకరణకు చట్టబద్ధత కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేయాలన్నారు. ఎరువుల సస్యరక్షణ మందుల, సాగు యంత్రాలు, పనిముట్ల మీద వేసే పనులతో సహా అన్ని రకాల పనులను ఉపసంహరించుకోవాలన్నారు. ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు రక్షణ కల్పించాలన్నారు. రైతాంగానికి కావలసిన ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. కౌలు రైతులను చట్టపరంగా గుర్తించి వారికి వ్యవసాయ గత రుణాలు సౌకర్యం, ప్రకృతి వైపరీత్యాల పరిహారం చెల్లింపు, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు అందించే అన్ని రకాల సహాయ సహకారాలను కౌలు రైతులకు అందించాలన్నారు. మహిళ రైతులకు, పత్తి కూలీలకు ప్రత్యేక సహాయ పథకాలు రూపొందించి, పసుతి సెలవులు, ఆరోగ్యం, సమాన హక్కులు, కల్పించాలని అన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో వేణుమాధవ్ కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, ఏఐసిటియు జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, బహుజన మహాసభ రాష్ట్ర నాయకులు నారపోయిన వెంకట యాదవ్, సి పి యు ఎస్ ఐ (ఆర్ ఎం ) రాష్ట్ర కార్యదర్శి చామకూర నరసయ్య, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు కొప్పుల రజిత, నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, నారాయణ వీరారెడ్డి, పందిరి సత్యనారాయణ రెడ్డి,మేరెడ్డి కృష్ణారెడ్డి, మేకనబోయిన శేఖర్, చిట్లింకి యాదగిరి, సైదులు, మల్లయ్య, కామల్ల లింగయ్య, రాములు పాల్గొన్నారు.