పిఠాపురం : మానవ జీవన మనుగడకు దిక్సూచి వంటిది పూర్వ పీఠాధిపతి హుస్సేన్ షా రచించిన షాతత్వ గ్రంధమని, పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పీఠం సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా 120వ జయంతిని పురస్కరించుకుని పిఠాపురం – కాకినాడ రోడ్ నందలి నూతన ఆశ్రమ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో ఆలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేసారు. మానవ భౌతిక శరీరము జీవించుటకు ఆధారమైన ప్రాణశక్తి అనే చైతన్యశక్తి ఏడు కేంద్రముల వద్ద మానవ శరీరములో ప్రవేశించడం జరుగుచున్నదని, ఈ కేంద్రముల వద్దనే మానవుడు తన ఆధ్యాత్మిక ప్రయాణములో తలుపులు తట్టి ఆధ్యాత్మిక మార్గమును అన్వేషించవలసియున్నదని ఆలీషా పేర్కొన్నారు. ఈడ, పింగళి, సుషుమ్మ నాడులు ఈ ఏడు కేంద్రముల గుండా వ్యాప్తి చెంది ఉన్నవని ఈ రహస్య ములను సప్తమ పీఠాధిపతి షాతత్వము అనే గ్రంథంలో నేను, కాలము, శ్వాస, శూన్యము, హంస, దృశ్యము, కుండలిని అనే ఏడు విషయ రహస్యములు సులభ శైలిలో అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక వికాసము కొరకు అందజేయడం జరిగినదని తెలిపారు. ఈ గ్రంథ రాజము ఇప్పటికి ఏడు ముద్రణలను అనగా ఏడు కూర్పులను సంతరించుకుని ఉమర్ ఆలీషా గ్రంథమండలి ద్వారా నేటికీ లభ్యమౌతుందని వెల్లడించారు. ఆంగ్లములో షా ఫిలాసిఫీగా అనువాదము చేయడం జరిగిందని అన్నారు. ఈ గ్రంధాన్ని ప్రతి ఒక్కరు చదివి ఆ విషయములు ఆకళింపజేసుకుని, ఆచరించాలని తెలిపారు. ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీ సాధనను అలవరచుకోవడం ద్వారా తాత్విక జ్ఞానం తెలియబడుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పీఠం సభ్యులకు పిలుపునిచ్చారు. తదుపరి “మాతృ వందనం” పుస్తకాన్ని పీఠాధిపతి సభలో ఆవిష్కరించారు. అనంతరం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేసి, పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులను సభలో పంపిణీ చేసారు. సభకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన మహావీర్ ఇంటర్నేషనల్ ప్రతినిధి కమల్ బేడ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ మానవులు బేధభావాలను విడనాడి సాటి మానవుని పట్ల సమదృష్టి కలిగి ఉండాలని సభ్యులకు భోదిస్తూ విశ్వ మానవ శ్రేయస్సే పరమావధిగా సాగుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని తెలిపారు. ఆధ్యాత్మిక తత్వ ప్రభోదం, సామాజిక సేవలను రెండునేత్రాలుగా చేసుకుని పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా చేస్తున్న సేవలను కొనియాడారు.
- ఆచార్య గోరుగొంతు అక్కుభట్లు శర్మ, మరియు విశ్రాంత ఉపాధ్యాయుడు చింతపల్లి అప్పారావులకు హుస్సేన్ షా స్మారక పురస్కారం అందజేత
కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా అందిస్తున్న హుస్సేన్ షా కవి స్మారక సాహితీ పురస్కారాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత సంస్కృత విభాగాధిపతి ఆచార్య గోరుగొంతు అక్కుభట్లు శర్మ, నాగులాపల్లికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు చింతపల్లి అప్పారావులకు సంయుక్తంగా అందజేశారు. వీరికి పురస్కారంతో పాటుగా ఒక్కొక్కరికీ రూ.25 వేల నూట పదహారు రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందజేశారు. ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా భీమవరంలో 35 సంవత్సరాలుగా విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహితీ సేవ చేస్తున్న సమితి సభ్యులను పీఠాధిపతి ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం పురస్కార గ్రహీతలు అక్కుభట్లు శర్మ, అప్పారావులు మాట్లాడుతూ తమకు ఈ పురస్కారం లభించడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. అంతర్జాతీయంగా ఆధ్యాత్మిక సాహిత్య సేవా కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తి పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా అని వెల్లడించారు. మానవాళికి మార్గదర్శనంగా నిలుస్తున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని పేర్కొన్నారు. సంగీత విభావరి కార్యక్రమంలో ఉమా ముకుంద బృందం ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపచేసాయి. ఈ సందర్బంగా జెడి న్యూస్ ఎడిటర్ రామ్ దాస్ వాజ్ పాయ్, పతంజలి శ్రీనివాస్, బాణాల దుర్గాప్రసాద్ సిద్దాంతి, శివరామకృష్ణ స్వామీజీ తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, పీఠం కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ పింగళి ఆనందకుమార్, ఎన్.టి.వి.ప్రసాద వర్మ, ఏవివి సత్యనారాయణ, సూర్యలత, సాహితీ సమితి కార్యదర్శి దాయన సురేష్ చంద్రజీ, ఉపాధ్యక్షుడు త్సవటపల్లి మురళీ కృష్ణ, కోశాధికారి వడ్డాది వెంకటేశ్వర శర్మ, గీతావధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.