సూర్యాపేట: సంపదను సృష్టిస్తూ దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారంసూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా స్థాయి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రెక్కల కష్టం చేసి సంపదను సృష్టిస్తున్న వ్యవసాయ కార్మికుల జీవనం దుర్భరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన వ్యవసాయ కార్మికులకుతినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట కరువైందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12000 ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి 23 నెలలు అవుతున్న ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు మంజూరు చేయటం సిగ్గుచేటు అన్నారు. వ్యవసాయ కార్మికులకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలన్నారు. వ్యవసాయ కార్మికులు సంపాదించే సంపాదనలో 90 శాతం విద్య, వైద్యానికి ఖర్చు చేస్తున్నారని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు నెలకు 7500 పింఛన్ మంజూరు చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రికరణ వచ్చిన వ్యవసాయతర కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున వారికి ఉపాధి కల్పించాలన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రోజురోజుకు చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ లకు పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సిబ్బంది వేతనాలు పెంచాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వ్యవసాయ కార్మికులకు వేతనాలు పెంచాలన్నారు. అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయి అన్నారు. అసైన్మెంట్ భూములను సాగు చేసుకుంటున్న పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలన్నారు. పేదల ఆధీనంలో ఉన్న ఇండ్ల స్థలాలకు పట్టా హక్కులుకల్పించి వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. శిక్షణ తరగతుల ప్రారంభానికి ముందు వ్యవసాయ కార్మిక సంఘం జెండాను సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ కార్మిక ఉద్యమ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు వెంకట నరసింహారెడ్డి, వర్ధిల్లి బుచ్చి రాములు చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు ప్రిన్సిపల్ గా వ్యవహరించిన ఈ శిక్షణ తరగతుల్లో జిల్లా ఆఫీస్ బేరర్స్ సోమపంగా జానయ్య, నల్ల మేకల అంజయ్య, జంపాల స్వరాజ్యం, వెంకటేశ్వర్లు గుంజ వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు ఆరే రామకృష్ణారెడ్డి, అంజపల్లి లక్ష్మయ్య, బచ్చల కూర రామ్ చరణ్, వనం సోమయ్య, ఉయ్యాల పారిజాత, ఎడమ పద్మ, మేకల ఉపేందర్, బచ్చల కూర రామదాసు, కొల్లూరి బాబు, పులసరి వెంకట ముత్యం, చర్లపల్లి మల్లయ్య, కల్లేపల్లి భాస్కర్, గాజుల జానయ్య, సిగ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
previous post
