నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. తన కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఎప్పటినుంచో ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ కీలక ప్రకటన చేశారు. ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా రానున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’లో మోక్షజ్ఞ కూడా నటించబోతున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు.గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆదిత్య 999 మ్యాక్స్ త్వరలోనే వస్తుంది. ఈ చిత్రంలో నేను, మోక్షజ్ఞ కలిసి నటిస్తాం” అని స్పష్టం చేశారు. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎన్నో ఏళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వార్త కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
