హైదరాబాద్, డిసెంబర్ 23 : ప్రచారం మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్త్రీ శక్తి ప్రతిభ పురస్కారాలు – 2025’ కార్యక్రమంలో ఏకదంత – ది స్కూల్ ఆఫ్ ఏన్షెంట్ స్టడీస్ సంస్థకు కల్చరల్ పార్టనర్ అవార్డ్ ను ప్రదానం చేశారు. ఈ అవార్డును శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల విదేశీ రాయబార కౌన్సిలర్ ప్రతినిధులు చేతుల మీదుగా ఏకదంత – ది స్కూల్ ఆఫ్ ఏన్షెంట్ స్టడీస్ సంస్థ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఎం.వి. సతీష్ కుమార్ స్వీకరించారు. భారతీయ సంస్కృతి, సంస్కృత భాష, ప్రాచీన భారత జ్ఞాన పరంపరల పరిరక్షణలో ఏకదంత సంస్థ చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేశామని నిర్వాహకులు ప్రచారం మీడియా సంస్థ చైర్మన్ మధు నాయుడు తెలిపారు. ఆధునిక తరానికి అర్థమయ్యే విధంగా సంస్కృత భాషా అధ్యయనం, భారతీయ ప్రాచీన విద్యలను పరిచయం చేయడంలో ఈ సంస్థ విశేషంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏకదంత వెబ్‌సైట్ ద్వారా వేలాది మంది విద్యార్థులు ఉచితంగా సంస్కృతం నేర్చుకుంటున్నారు.
“సంస్కృతము నేర్చుకుందాం – మన సంస్కృతిని తెలుసుకుందాం” అనే నినాదంతో సంస్థ ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మేడ్చల్ పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, ప్రముఖ నృత్యకారిణి గెడ్డం పద్మజ, దేశీ–విదేశీ అతిథులు పాల్గొన్నారు.
