గత కోన్ని రోజులుగా బస్టాప్ లేక పోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, రాంసానిపల్లి చౌరస్తా వద్ద బస్టాప్ ను ఏర్పాటు చేయాలంటూ ఐదు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు నారాయణఖేడ్ డిపో మేనేజర్‌ను కలిసి కోరగా ఆయన సానుకూలంగా స్పందించి ఎక్స్‌ప్రెస్ స్టాప్‌కు అనుమతినిచ్చారు. గత కొన్ని రోజులుగా ప్రయాణీకులు, విద్యార్థులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, నాయకులు సోమవారం రాంసానిపల్లి వద్ద ఆర్టీసీ బస్‌స్టాప్ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక నుంచి అన్ని రకాల ఆర్టీసీ బస్సులు ఇక్కడ అగుతాయని ఆర్టీసీ అధికారులు గ్రామ నాయకులకు హమీ ఇచ్చారు. చౌరస్తా వద్ద బస్టాప్ ఏర్పాటుతో రాంసానిపల్లి, ఎర్రారం, నేరడిగుంట, రాంసాని పల్లి తండా, కిచ్చన్నపల్లి గ్రామాలకు చెందిన ప్రయాణికులకు ఎంత గానో లబ్ధి చేకూరుతుందని ఆయా గ్రామాల నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ బస్సులు అపకపోవడంతో ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. నారాయణ ఖేడ్ డిపో మేనేజర్ మల్లేశం చొరవతో బస్టాప్ ఏర్పాటు అయ్యిందని, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన పెద్దలు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.