రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూర్ గేట్ పక్కన సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆలూర్ గ్రామానికి చెందిన నక్కలపల్లి రాములు, దామరగిద్ద కృష్ణ, నాంచేరి గ్రామానికి చెందిన శ్యామల సుజాత అక్కడికక్కడే మృతి చెందారు. టోలీచౌకీ ప్రాంతానికి చెందిన జమీల్ అనే వ్యక్తి చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీం భరత్, స్థానిక నాయకులతో కలిసి బుధవారం ఆలూర్, నాంచేరి గ్రామాలకు వెళ్లి ఆయా కుటుంబాలను పరామర్శించారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామని భరోసానిచ్చారు. తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు. అదే విధంగా ఆయా కుటుంబాల పిల్లల చదువుల కోసం అయ్యే ఖర్చులకు చేయూతగా ఉంటానని, ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు సున్నపు వసంతం, షాబాద్ దర్శన్, గోనే ప్రతాప్ రెడ్డి, మర్పల్లి కృష్ణా రెడ్డి, మండలాధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, ఆలూర్ మాజీ సర్పంచ్ విజయలక్ష్మీ నర్సిములు, నాయకులు పడాల రాములు తదితరులు పాల్గొన్నారు.
previous post