నేటి పోటీ ప్రపంచంలో చాలా మంది ఒక ఉద్యోగం వస్తే ఈ జీవితానికింతే చాలు అనుకుంటారు. తను మాత్రం అలా అనుకోలేదు. తనే చేవెళ్ల మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన యువకుడు డా. ఘనపురం సుదర్శన్. 2018 లో పోలీసు కానిస్టేబుల్ గా ఎంపికైనా సుదర్శన్ సంతృప్తి చెందలేడు. కారణం తాను ఎదుర్కొన్న అవమానాలు, తనకున్న సంకల్ప బలం. ఎలాగైనా ప్రభుత్వ అధికారి కావాలన్నది తన కల. అందుకు తాను రాత్రింబవళ్లు శ్రమించాడు. ఈ క్రమంలో 2022 లో ఉస్మానియా యూనివర్శిటీ నుండి మాజీ గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్ డీ పట్టా పొందాడు. దాంతో ఆగకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసిన జూనియర్ లెక్చరర్ పోస్టులకు కష్టపడి చదివి, పరీక్షలు రాశాడు. ఆ పోస్టులకు సంబంధించి నిన్న విడుదల చేసిన ఫలితాల్లో సుదర్శన్ తెలుగు జేఎల్ పోస్టుకు ఎంపికయ్యాడు. అతి సంక్లిష్టమైన పోలీసు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ, మరో ఉద్యోగం సాధించడమంటే కత్తిమీద సామే అనుకోవాలి. కానీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని దీక్షతో ఔరా అనిపించేలా గెజిటెడ్ అధికారి స్థాయి అయిన జూనియర్ లెక్చరర్ గా సుదర్శన్ ఎంపికై అందరి మన్ననలు పొందుతున్నాడు.