పరామర్శించే అక్షరాలు ప్రశ్నించడం మొదలుపెడితే విప్లవ కావ్యాలు క్షణికావేశం చేయకుండా పాఠకులను కరచాలనం చేసే విధంగా పుట్టుకొస్తాయి,అబద్ధానికి, నిజానికి మధ్య కొట్టుమిట్టాడుతున్న మనుషుల మాటలు, చేష్టలు, అధికారాలు, అవలీలగా అబద్ధాలు ఆడుతుంటే, అమ్మ రొమ్ము పాలు తాగుతూ కాలితో గుండెలపై తన్నట్టు ఉంటుంది…
అబద్ధానికి అలవాటు పడి, వంచనకు ఆకర్షితులై వాస్తవాలను సమాధి చేస్తున్న ఈ నవ కలియుగ సమాజ నాయకులు, ప్రజలు, జీవితం గురించి ఎంతో విప్లవాత్మకంగా వివరించి చెప్తున్నారు మన కవి అరణ్య కృష్ణ గారు…
మనం బ్రతుకుతుంది భూమి మీదనో, లేక అబద్ధాల జతతోనో తెలియని స్థితిలో బ్రతికేస్తున్నాం…
కృష్ణగారి అక్షరాలు పురిటి నొప్పులు పడే తల్లి ఆవేదనలా ఉంటాయి, ఆయన లిఖించే అక్షరాలు కోట సామ్రాజ్యాన్ని సైతం తునాతునకలు చేసే విధంగా గంభీరంగా ఉంటాయి, సమాజ మార్పు కోసం, సమాజ స్థితిగతులను సరి చేయడం కోసం, హృదయాంతరంగంలో రగులుతున్న జ్వాలలు అతని అక్షరాలలో కనిపిస్తాయి…
ఇక కవిత్వం విషయానికి వస్తే
*************
*అబద్ధం*
***************
ఏళ్లకు ఏళ్లుగా వీధుల్లో పడి నెత్తురు తాగి
కడుపు నింపుకున్న నారింజరంగు మబ్బులు
మళ్లీ ఆకాశం నుండి కింద పడి
ముంచెత్తడానికి సిద్ధంగా వున్నాయి
ఎక్కడ చూసినా అబద్ధాల ఆయుధ ఫేక్టరీలు లేస్తున్నప్పుడు
కత్తులు ఎల్లవేళలా లోహ రూపంలో తయారవ్వవు
గవర్నమెంటు కుళాయిలు తిప్పితే నీళ్లు కాక
పుకార్లు ధారగా పడుతుంటే
కాళ్ల ముందు సత్యం
ఓ అనాధ బిడ్డలా బిగ్గరగా రోదిస్తూ ఉన్నది
అబద్ధం రాబందు రెక్కల చప్పుడులా
దేవుళ్ల పేర్లు వల్లె వేస్తూ నిద్రల్ని కొల్లగొడుతున్నది
చరిత్ర రోజుకోరకంగా అచారిత్రికమై పోయి
వాస్తవాలు వీధి కాలువల్లో కలిసిపోయాక
అబద్ధాన్ని మించిన చరిత్ర లేదు
దాన్ని మించిన ఆదర్శమూ లేదు
మతం నుండి రాజ్యం వరకు
అన్నీ అబద్ధాల హోమగుండాలే
వొళ్లంతా నేతులు పూసుకొని
పొటాపొటీగా అందులోకి దూకేస్తున్నారు
శ్వాస కోశాల్లోకి ఆబగా పుకార్లు కుక్కుకుంటున్నారు
వెన్నులో కత్తిపోట్లు దిగిన బాధితుడే
నిందితుడిగా నమోదవుతున్నాడు
రక్తాల్లో ముంచి తీసిన చేతులే
సింహాసనాల్ని ప్రేమగా నిమురుతున్నాయి
వెంటాడుతున్న రైఫిళ్లల్లా దుర్మార్గాలు భయపెడుతుంటే హడావిడిగా పోతుంటానా
దారి పొడుగునా చెత్త కుండీల్లో పారేయబడ్డ మెదళ్లు!
కిక్కిరిసిన ట్రాఫ్ఫిక్కుల్లో
చకచకా కదిలిపోతున్న మొండేల్లాంటి మనుషులు!
మెడల మీద మొబైళ్లు అతికించుకొని
లోహపు విగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న
దున్నపోతు చర్మాల్ని ఫాషనబుల్ గా తొడుక్కున్న పౌరులు!
రక్తమాంసాలున్న గుండెల్ని పెరికేసుకున్న దేహాల్లోపల
పెరుగుతున్న ఇనుప కంచెలు!
పాలబుగ్గల మీద కూడా యజ్ఞయాగాదుల నల్లటి మసి!
ముట్టుకుంటే ఒక్కొక్కడూ
సగం కాలిన కట్టెలా గుచ్చుకుంటున్నాడు
మార్చురీలో శవాల కాళ్లకి నంబర్ల కార్డులు కట్టినట్లు
ప్రతివాడి చూపుడు వేలికి వోటర్ కార్డులు, నల్ల సిరా మచ్చలు!
ఏమిటో ఒకడి నోటికి మరొకడిని
ఆహార పదార్ధం చేస్తున్నంత కర్కశత్వం
మనుషుల్ని ప్రేమించడం మానేసి
మట్టి మీద నెత్తుటి మోహం పెంచుకోవడం ఓ ఆదర్శం
నీడై వెంటాడుతున్నది ద్వేషం
ఒక్క క్షణం నడక ఆపితే
కసుక్కున మెడలో కత్తులు దింపుతున్నది
నాడీ మండలం ధ్వంసమైపోయి
మెదడులో పుట్టలు లేచి
మతం తాచుపాములై దూరిపోతున్నది
అబద్ధం ఈ దేశపు శ్వాస అవుతున్నది
ఇప్పుడు నాకు అబద్ధాల్ని మించిన శతృవుల్లేరు
ఏ కాలంలో అయినా సత్యం బతకాలంటే
అబద్ధాల్ని హత్య చేయాల్సిందే
కవిత్వం రాస్తున్న నేను అబద్ధాల హంతకుణ్ని
కవిత్వం
సామాజిక క్రిమి సంహారకం
రచయిత : *అరణ్య కృష్ణ*
వినువీదులుగాంచిన అబద్ధం హఠాత్తుగా నేలపై పడి సంఘాన్ని ధ్వంసం చేస్తుందని…
అర అంగుళం కూడా వదిలి పెట్టకుండా అబద్ధాల ఫ్యాక్టరీలు లేస్తున్నప్పుడు, లోహ రూపంలో కత్తులు తయారవ్వవా..!? అంటూ ప్రశ్నలతోనే పాఠకులను ఆకర్షిస్తున్నారు మన రచయిత…
ఏ అధికారం లేని సమాజం అలానే ఉంది, అధికారం ఉన్న ప్రభుత్వ పాలన కూడా అబద్దాల పుకార్లతోనే కాలం వెళ్లబుచ్చుతుంది అని, అబద్ధం రాబందు రెక్కల చప్పుడు చేస్తూ దేవుళ్ల పేర్లు వల్లే వేస్తూ నిద్రని కొల్లగొడుతుందని, సత్యం ఒక అనాధలా కాళ్ల దగ్గర పడి బిగ్గరగా రోధిస్తుందని, సత్యాన్ని గ్రహించని మనుషులు, అబద్ధపు మాయలో కాలాన్ని ఎలా గడుపుతున్నారో కవి ఎంతో సున్నితంగా విశదీకరించి వివరించారు…
చరిత్ర మొత్తం నాశనం అయ్యి వాస్తవాలు అన్ని మురుగు కాలవల్లో కలిసిపోతుంటే అబద్ధాన్ని మించిన చరిత్ర మరొకటి ఉంటుందా.! దాన్ని మించిన ఆదర్శము మరొకటి ఉంటుందా.! అంటున్నారు రచయిత…
అబద్దాల హోమగుండంలో, ఒళ్లంతా నేతిని పూసుకుని పోటాపోటీగా దూకేస్తున్నారు, ఊపిరిగా పుకార్లు తీసుకుంటున్నారు జనాలు, నిజమే మోసపోయిన వాడే నిందితుడిగా మారుతున్నాడు, రక్తంతో కడిగిన చేతులే అధికారాన్ని దక్కించుకున్నాయి అంటూ వాస్తవికతను కన్నులకు కట్టినట్లు చూపిస్తున్నారు ఈ కవి…
సాంప్రదాయాలు కాలతన్ని, వికృత అలంకరణకు అలవాటు పడి, చరవాణికి బంధీలయి, మొండానికి ,మెదడుకి బంధమే లేనట్టు తిరిగేస్తున్నారు ఈ పౌరులు అంటూ మారుతున్న సమాజ స్థితిగతులను ఒక కంట కనిపెడుతూ ఎంతో ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు రచయిత…
రక్తపు ముద్దలే కానీ ఇనుప కంచెలులా మారుతున్నారు, పాల బుగ్గల మీద కూడా యజ్ఞ యాగాదుల నల్లటి మసి, ముట్టుకుంటే ఒక్కొక్కడు సగం కాలిన కట్టెల గుచ్చుకుంటున్నాడు, మార్చురీలో శవాల కాళ్ళకి నెంబర్ కార్డులు వేసినట్టు ప్రతి వాడి చూపుడు వేలుకి ఓటు వేసినట్టు నల్లటి మచ్చలు, ఏమిటో ఒకటి నోటికి మరొకటిని ఆహార పదార్థం చేస్తున్నంత కర్కశత్వంగా ఉంది ఈ సమాజం అంటూ ఎంతో బాధను కఠినమైన పదాల్లో వ్యక్తం చేస్తున్నారు…
మనుషులను ప్రేమించడం మానేసి, కులమతాల కోసం పరువు హత్యలు పెరుగుతున్నాయి, నీడలా వెంటాడుతున్న ద్వేషం ఒక్క క్షణం నడక ఆపితే మెడలో కత్తులు దింపేస్తుంది, అబద్ధమే ఈ దేశపు శ్వాసగా మారుతుంది, ఇప్పుడు నాకు అబద్దాలను మించిన శత్రువులు లేరు, సత్యం బ్రతకాలంటే అబద్దాన్ని హత్య చేయాల్సిందే…
కవిత్వం రాస్తున్న నేను అబద్ధాల హంతకున్ని అంటూ సత్యం ఏ విధంగా మన్నుపాలవుతుందో, గర్వాలకు ద్వేషాలకు పోయి జనులు అబద్దాలకు అలవాటు పడి ఏ విధంగా దిగజారిపోయి బ్రతుకుతున్నారో, సంస్కృతి సాంప్రదాయాలను విడనాడి, పరదేశ సాంప్రదాయ వ్యామోహానికి ఎంత ఆకర్షితులో అవుతున్నారో, బ్రతికేది భూమిపైనే అయినా ఆశలు ఎక్కడో ఆకాశంలో విహరిస్తుంటే, నా అనుకునే బంధాలు నిలబడతాయా.!? నీకోసం ఒక్కరైనా వస్తారా.!? అబద్దాలు చెప్పు బ్రతకడం కూడా ఒక బ్రతుకేనా.!? అంటూ ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, దౌర్జన్యాలను, దగాకోరులను, తెల్లటి వస్త్రాలు ధరించి లోపల రక్తం చిమ్ముతున్న సాతానులను, దాటడం, వారి చెర నుండి విడిపించుకోవడం సులువేనా.!?
అంటున్నారు రచయిత కృష్ణ గారు…
చెట్టు నీడ కింద చేత తీరడం సులువే కానీ ఒక విత్తనాన్ని వేసి దానిని వృక్షాన్ని చేయడం ఎంతో కష్టం, అరణ్యకృష్ణ గారి కవితలు కూడా అలాంటివే మాటల్లో అగ్నిపర్వతాలు ఉన్నా, నిజానికి అవి వాస్తవాలు, గ్రహించగలిగితే ఒక మనిషి బ్రతుకు తెరువు, అంగీకరించి అవలంబించగలిగితే సమాజ మార్పు తథ్యం, ఇలాంటి మరెన్నో రచనలు మీరు చేస్తూ, సమాజంలో , యువతలో జరుగుతున్న మార్పులు చెప్తూ సరైన మార్గంలో అందరినీ నడిపించాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…
సమీక్షకురాలు : *పోలగాని భాను తేజశ్రీ*