Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ప్రత్యేక కథనం

నిలబడేనా ఇక – రక్త సంబంధాలు

సమాజాన్ని ఎదిరించడం ఒక ఎత్తు అయితే, కూలిపోతున్న బంధాలను నిలబెట్టాలని ఆరాటపడే అక్షరాల తలపు మరోవైపు, హృదయంలోని ఆలోచనలే కాదు, కనుల ముందు కనిపిస్తున్న ఆవేదనలకు కూడా అక్షరం ఒక రూపాన్ని ఇస్తుంది, తనలో సమ్మిళితమైన ఎన్నో భావాలకు రూపం పోస్తుంది, అది ఏ బంధమైనా సరే విభేదాలు ఉంటే సర్దుమనిగేలా సున్నితమైన వాక్యాలను బయటపెడుతుంది…

ఆనాటి రక్త సంబంధాలు ఒకరికి ఒకరు ప్రాణం ఇచ్చుకునేలా ఉన్నాయి, ఈనాటి రక్త సంబంధాలు కత్తి పట్టుకుని ఒకరినొకరు పొడుచుకునేలా ఉన్నాయి, ఇది సమాజంలో జరుగుతున్న మార్పు వలనో లేక విచ్చలవిడిగా తయారవుతున్న జనాలు సంస్కృతిని నాశనం చేయడం వలనో అర్థం కావడం లేదు…

ఏది ఏమైనా సరే ఒక్క కడుపునుండి బయటకు వచ్చిన బిడ్డలు ఎదురు బోదురు నిల్చుంటే ఒక్క నిమిషం కూడా ఇరువురికి పడటం లేదు… బంధాల్లో మార్పు తీసుకురావడం కోసం, వాస్తవాలు సాటి చెప్పడం కోసం సంతోష్ కుమార్ గారి కలం కదులుతుంది, ఒక రచయిత తనలోని భావాలకు రూపం ఇవ్వడం మాత్రమే కాదు, సమాజంలో జరుగుతున్న వాస్తవాలు తెలియజేసే విధంగా రచనలు చేయడం కూడా ఎంతో అద్భుతమైన విషయం, మన రచయిత సంతోష్ గారి రచనలు కూడా ఈ కోవలోకే వస్తాయి, నశించిపోతున్న మానవ సంబంధాల గురించి, వికృతంగా మారుతున్న మనుషుల మనసుల గురించి, అవకాశవాదులుగా మారుతున్న మానవ మృగాల గురించి ఎంతో చాకచక్యంగా చెబుతున్నారు మన రచయిత

 

ఇక కవిత్వం విషయానికి వస్తే

**************

*ఒక్క పేగే కదా మనం*

**************

ఆ చీకటి నెత్తుటి కోవెల కొలనులోని

మాంసపు తీగల గర్భంలోనే

*కదా రా* నువ్వు నేను

ఈ పుడమిపై జీవితానికి జీవం పోసుకుని

ఓ పేగు తెంచుకొని పుట్టినది…

కాకపోతే

ముందు నువ్వు వెనక నేను..!!!

గుప్పెడు మెతుకులు గతికి

కడుపు కాలం గడిపే జీవితంలో

మన మధ్య ఏమిటో ఈ విభేదాల విన్యాసాలు…!!!

తండ్రి రెక్కల దుఃఖం మీద

అమ్మ ప్రేమ పోసి పెంచిన బంధం మనది

నాలుగు దిక్కులు కలిసి తిరిగిన జీవితాలు రా మనవి…

ఏమిటో ఈ దినం

మన మధ్య శత్రుత్వపు మాటల యుద్ధం..!!

నాకు నువ్వు నీకు నేను

ఒకరికొకరు తోడు కాటి వరకే రా

మన తల్లి కన్నా ఈ బంధం గడిపేది…!!!

నాపై నీకు నీపై నాకు

కోపం ఏమిటో కాటిలో కలిసే ఈ బతుకు కొరకు…

కడుపు కట్టుకుని ఎంత పోగేసుకున్నా కాటివరకు రాదు

ఇరుగుపొరుగు ఎంతమంది తోడున్నా ఒక్క తల్లి పిల్లలం కాము…!!!

తనువుపై మన్ను కప్పుకొని మాసిపోయే వాళ్ళం

ఎప్పుడు ఏ క్షణం వెళ్ళిపోతామో తెలియని ఒక్క తల్లి పిల్లలం

అన్నదమ్ములం…!!!

 

రచయిత : సిహెచ్ సంతోష్ కుమార్

***************

ఒక్క పేగుని పెన వేసుకుని నువ్వు ఒకసారి నేను ఒకసారి జన్మించిన మాంసపు ముద్దలం మనం…

క్షణక్షణం మనల్ని కాచి, కంటి నిదుర లేకుండా మనకు ఒక రూపాన్ని తెచ్చింది అమ్మ…

మూడు పూటల కడుపు నింపుకోవడం కోసం ఎందుకు మన మధ్య ఈ విభేదాల విన్యాసాలు అంటూ తోబుట్టువుల మధ్య జరుగుతున్న మానసిక ఆందోళనను, మాటల యుద్దాలను ఎంతో బాధతో చెప్తున్నారు రచయిత…

పుట్టినప్పటినుంచి, నాన్న రెక్కల కష్టం మీద, అమ్మ చూపించే స్వచ్ఛమైన ప్రేమను అందుకుని కలిసి పెరిగాం కదరా మనం, ఈ క్షణాన మన మధ్య ఎందుకు ఇంత ఈర్ష్య ,కుళ్ళులు…!?

ఎందుకు మన మధ్య ఈ శత్రుత్వపు మాటలు…

ఈ ప్రపంచాన అమ్మ నాన్న పోయాక, నాకు నువ్వు నీకు నేను, మన బంధమే కదా స్వచ్ఛమైనది, కానీ దేనికోసమో ఈ రకమైన వ్యత్యాసం మన ఇద్దరి మధ్య, మన బంధమైన సరే కాటి వరకు మాత్రమే కదా..!? ఏ క్షణాన మరణం సంభవించునో తెలియదు అలాంటి బ్రతుకులకు కోపతాపాలు అవసరమా అంటూ రచయిత ఎంతో ఆవేదనతో వాస్తవాన్ని గ్రహించి కలాన్ని కదిలిస్తున్నారు…

పోయేప్పుడు ఏమీ తీసుకుపోలేము, మన బంధాన్ని దూరం చేసుకునే, వేరే ఒక నలుగురితో కలిసి ఉన్నంత మాత్రాన ఒక తల్లి బిడ్డలం కాలేము కదా, అంత ప్రేమ దొరుకుతుందా..!? అంటూ ఈ భూమిపై ఎంతకాలం నూకలు ఉన్నాయో ఎప్పుడు చెల్లుతాయో తెలియని బ్రతుకులకు పగలు అవసరమా అంటూ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, తోబుట్టువుల బంధం

రుణరుణాల అనుబంధం అంటూ ఎంతో చాకచక్యంగా అన్నదమ్ముల బంధం గురించి వర్ణించారు మన రచయిత సంతోష్ కుమార్ గారు…

ఇలాంటి మరెన్నో రచనలు మీరు చేస్తూ, సమాజం నిజాన్ని గ్రహించే విధంగా మీ కవనాలు మరింత ముందుకు సాగాలని, మీ అక్షరాల బాణాలను సూటిగా మనుషుల మనసుల్లోకి విసురుతూ ఆలోచింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…

సమీక్షకురాలు : పోలగాని భానుతేజశ్రీ MBA LLB

Related posts

శీర్షిక : పెళ్లి

Dr Suneelkumar Yandra

కొమ్ముల మధ్య నుంచి శివుడిని ఎందుకు దర్శించుకొంటారు

Dr Suneelkumar Yandra

నేతాజీ సుభాష్ చంద్ర బోసు వర్ధంతి సందర్బంగా వారి గురించి ప్రత్యేక కథనం

Dr Suneelkumar Yandra

నిగూఢ నిర్ణయం – విజయానికి తొలి పదం

Dr Suneelkumar Yandra

కాకనందివాడ గ్రామ దేవత కాకినాడ నూకాలమ్మ

పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

TNR NEWS