ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు చింత బాబు మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాణాల అబ్రహం మాదిగ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అంబేద్కర్ అభయహస్తం పథకంతో ప్రతి మాదిగకు 12 లక్షల రూపాయలు ఇస్తామని నేటికీ ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా డప్పు, చెప్పు కుట్టుకునే మాదిగలకు 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వడంతోపాటు లెదర్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి బాణాల అబ్రహం మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి నాగేశ్వరరావు, కార్యదర్శి బొల్లెపోగు స్వామి, పిడమర్తి బాబురావు, సోమపొంగు శ్రీను, చింతా రాము తదితరులు పాల్గొన్నారు…….
