కాకినాడ : బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ ఆలీషా అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సోదరుడు అహ్మద్ ఆలీషా అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, కాకినాడ ఆశ్రమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 140 వ జయంతి సభ కు పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు అధ్యక్షత వహించగా, పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సోదరులు అహ్మద్ ఆలీషా, హుస్సేన్ షా ముఖ్య అతిథులుగా వేదిక పై ఆసీనులై ప్రసంగించారు. అహ్మద్ ఆలీషా ప్రసంగిస్తూ సాధారణంగా ఒక వ్యక్తి ఎంతగానో కృషి చేస్తేనే గానీ తాను ఎంచుకున్న రంగంలో విజయ శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది. అలాంటిది ఒకే వ్యక్తి విభిన్న రంగాలలో అప్రతిహతంగా తన ప్రభావాన్ని చూపి, లోకంలో చెరగని ముద్ర వేయడం అనేది అందరికీ సాధ్యం కాని పని. వారినే మనం బహుముఖ ప్రజ్ఞాశాలురుగా పిలుస్తాం, ఆదరిస్తాం, ఆదర్శంగా స్వీకరిస్తాం కూడా. అటువంటి వారిలో అగ్రగణ్యులు డా. ఉమర్ ఆలీషా, ఆయన మహాకవి, శతావధాని, తత్త్వవేత్త, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు, అన్నిటి కన్నా విశేషించి సుప్రథితమైన మహనీయ చరిత్ర కలిగిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠానికి షష్ఠ పీఠాధిపతులు. ఇలా ఒకటా? రెండా? అనేక పదవులను అలంకరించి ప్రతి క్షణం లోకహితం కోసం జీవించిన మహిమాన్విత మూర్తి. వీరి మాతృభాష తెలుగు కాదు. కానీ తెలుగులో అద్భుత సాహిత్య సంపద సృష్టించి మహాకవిగా విఖ్యాతి పొందా రన్నారు. ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హుస్సేన్ షా మాట్లాడుతూ ఆధ్యాత్మిక పీఠానికి పీఠాధిపతి అయినప్పటికీ కేవలం ఆధ్యాత్మిక తత్త్వానికే కట్టుబడిపోకుండా సామాజిక రుగ్మతల మీద కలాన్ని కొరడాలా ఝళిపించిన సంఘ సంస్కరణాభిలాషి ఉమర్ ఆలీషాగారు. స్వాతంత్ర్య సమరయోధునిగా జాతీయోద్యమంలో పాల్గొని, భరతమాత దాస్య శృంఖలాలను ఐకమత్యంతో త్రెంచివేయాలనే తపనతో విభిన్న వేదికలపై భారతీయులందరినీ జాగృతపరిచేలా చైతన్యం చేసేలా గంభీరోపన్యాసాలు చేసిన మహావక్త ఉమర్ ఆలీషా వారు అని అన్నారు. పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు మాట్లాడుతూ భారత శాసనసభలో ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆంగ్ల ప్రభుత్వం ముందు లోపాలను ఎత్తి చూపించి ప్రజా పక్షపాతియై పోరాడిన ఉత్తమ రాజకీయ నాయకులు ఉమర్ ఆలీషా వారు అని అన్నారు. రిటైర్డ్ ఆర్టిఓ రామచంద్ర రావు మాట్లాడుతూ డా. ఉమర్ ఆలీషా ఎన్నో ఎన్నెన్నో.. వారి సేవలు అమోఘం. వారి కీర్తి అజరామరం. వారి మూర్తి భారతదేశానికే స్ఫూర్తి. అభ్యుదయ రచయితగా, ప్రగతి నిర్దేశకునిగా, మహోన్నత వక్తగా, మానవతావాదిగా, తత్త్వ ప్రవక్తగా, పీఠాధిపతిగా, ఇలా బహుముఖ ప్రజ్ఞావంతుడిగా ఖ్యాతి గడించారు అని అన్నారు. ప్రముఖ పేరడి గాయకుడు బల రామ కృష్ణ పాడిన పాట సభికులను అలరించింది. అతిథులుగా వచ్చిన వారిని అహ్మద్ ఆలీషా సన్మానించారు. కేక్ కట్ చేసి చిన్నారుల కు పంపిణీ చేశారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ ఖండవల్లి వీరభద్రం మాట్లాడుతూ అజ్ఞానం, మూఢనమ్మకాలు, మత మౌఢ్యం, పేదరికం, బానిసత్వం, అవిద్య లాంటి సాంఘిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని సంస్కరించేందుకు అనన్య సామాన్యమైన కృషి సాగించి ధన్యులైన కవి పుంగవులు, రచయితలలో ఉమర్ అలీషాది ప్రత్యేక స్థానం. ఇంతటి విశిష్టత కలిగిన ఉమర్ ఆలీషా వారి జీవితం అందరికి ఎంతగానో ఆదర్శం. వీరి రచనలు దేశభక్తిని, ధార్మిక చింతనను, తాత్త్విక జ్ఞానాన్ని అందరిలో నింపుతాయనే సదుద్దేశంతో 7వ తరగతి మరియు 10వ తరగతి పాఠ్య పుస్తకాలలో వీరి రచనలు పాఠ్యాంశాలుగా పెట్టబడ్డాయి. ఇంతటి ప్రతిభా మూర్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ ఆలీషా వారు 1885 ఫిబ్రవరి 28వ తేదీన జన్మించారు. ఈ సందర్భంగా వీరి 140 వ జయంతి వేడుకలలో వందలాది సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖ సేవలు అందించిన వారికి ధాన్యపు కుచ్చులు అందచేశారు. హారతితో సభ ముగిసింది. ఈ కార్యక్రమంలో స్థానిక కన్వీనర్ లు మండా యల్లమాంభ, కాకినాడ లక్ష్మి, రెడ్డి సూర్య ప్రభావతి, వనుము మణి, బాదం లక్ష్మి కుమారి, కె. వీరభద్రరావు, రెహ్మన్ తదితరులు పాల్గొన్నారు.
