- వినియోగదారుల ఉద్యమ పితామహులు తిమ్మాజీరావు, సత్యనారాయణలకు నివాళులర్పించిన పౌరసంక్షేమ సంఘం
కాకినాడ : ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పూర్వ తూర్పు గోదావరి జిల్లాలో పేరొందిన వినియోగదారుల ఉద్యమ పితామహులుదివంగత పి.ఎస్.ఆర్.కె తిమ్మాజీరావు, హేజీబు సత్యనారాయణ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక రామారావు పేట గాయత్రి భవన్ లో సరిపెళ్ళ శ్రీరామ చంద్ర మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం నందు పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం ప్రయోజనాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా యువకులు కృషి చేయాలని కోరారు. నగర, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులకు వినియోగదారుల రక్షణ చట్టం ప్రయోజనాలు హక్కులు బాధ్యతలు అంశం మీద వారిరువురికి అంకిత మిస్తూ ప్రత్యేకంగా ముద్రిస్తున్న పది వేల కాపీల పుస్తక ప్రతులను జూన్ నుండి ఉచితంగా పంపిణీ చేసే ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతుబజార్, మున్సిపల్ మార్కెట్ వినియోగ దారుల సంఘాలతో బాటుగా ఆగస్టు 15న 18మంది సీనియర్ సిటిజన్స్ తో గ్రేటర్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పలువురు సీనియర్ సిటిజన్స్, మహిళలు పాల్గొన్నారు.