సూర్యాపేట టౌన్: పట్టణ ప్రాంతాలలో నివాసముంటున్న భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు భూమిలేని పేదలందరికీ ఏడాదికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్న నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న భూమిలేని పేదలకు మాత్రమే ఈ పథకానికి అర్హులని చెప్పడంలో అర్థం లేదన్నారు. పట్టణంలో ఉన్న నిరుపేదలు పేదలు కాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని పట్టణంలో భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేసే చర్యలు చేపట్టాలని కోరారు. లేని యెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పట్టణ ప్రాంత పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం కేరళ వామపక్ష ప్రభుత్వం తరహాలో పట్టణ ప్రాంత ప్రజలకు ఉపాధి హామీని అమలు చేయాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి కి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ టౌన్ కమిటీ సభ్యులు అర్వపల్లి లింగయ్య, వట్టే ఎర్రయ్య, మాధగోని మల్లయ్య, నాయకులు ఏర్పుల సైదమ్మ, నల్ల మేకల రామ్ కుమార్, బుద్ధ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
