కాకినాడ :159 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన కాకినాడ పురపాలక పూర్వ సమావేశ మందిరం నేడు డంపింగ్ యార్డ్ తరహాగా బూత్ బంగ్లాగా మారిపోయిందని పౌర సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. శతాధిక సంవత్సరాల క్రితం ఫ్రెంచ్ డచ్ బ్రిటీష్ వారు పరిపాలించిన హయాంలో ప్రఖ్యాతి రాతి కట్టడంతో పటిష్టంగా నిర్మించిన పురపాలక సమావేశ మందిర భవనం జిల్లా కలెక్టరేట్ నిర్మాణ హయాంలోనే నిర్మించబడిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 19 సంవత్సరాల క్రితం రూ.2కోట్లు వెచ్చించి పురావస్తు భవనాన్ని కాపాడటానికి అప్పటి ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. గత పదేళ్లుగా కార్పోరేషన్ ఉన్నతాధికారులెవరూ ఇక్కడి సినిమారోడ్ లోని కార్యాలయ భవనాల్లో వుండకపోవడం వలన ఆవరణ యావత్తూ డంపింగ్ యార్డ్ గా మారిందన్నారు. అసాంఘిక శక్తులు రాత్రివేళల్లో ఇక్కడి కార్యాలయం లోపల ఆనంద భారతి గ్రౌండ్ ను అడ్డాగా చేసుకుని మద్యం మాదక ద్రవ్యాలు సేవిస్తున్న దుస్థితి ఏర్పడిందన్నారు. అసాంఘిక కృత్యాలు కూడా జరుగుతున్నాయన్నారు. పురాతన భవనంకు చెందిన రాతి కట్టడం చెక్కు చెదర లేదని పైకప్పు చుట్టూ పూర్తి స్తాయిగా శిథిలం అవ్వడం వలన పలు చోట్ల కూలిపోయిందని, పూర్తిగా వర్షం కురిసే దుస్థితి వుందన్నారు. ఇలాగే వదిలేస్తే రానున్న భారీ వర్షాలకు పైకప్పు పూర్తిగా నేల మట్టం అవుతుందన్నారు. ప్రత్యేక అధికారి కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వేంకటేశ్వర రావు (కొండబాబు), రూరల్ ఎమ్మెల్యే పంతం వేంకటేశ్వరరావు (నానాజీ), ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా మంత్రి, డిప్యూటీ సిఎం కొణిదల పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యక్ష సందర్శన చేసి చారిత్రాత్మక పురపాలక మందిర నిర్మాణం పరిరక్షించే చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు పంపించడం ద్వారా నగర చరిత్రను సంరక్షించాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. 1947కి ముందు జవహర్ లాల్ నెహ్రూ సరోజినీ నాయుడు దుర్గాబాయి దేస్ ముఖ్ వంటి జాతీయ స్వాతంత్ర్య సమరయోధులు దామోదరం సంజీవయ్య, మర్రి చెన్నారెడ్డి, ఎన్.టి.రామారావు వంటి ప్రసిద్ధ మాజీ ముఖ్యమంత్రులను పౌర సన్మానాలతో సత్కరించుకున్న చారిత్రాత్మక ప్రదేశమన్నారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీ నగర్ పార్కులో సిద్ధమైన సమావేశానికి ముందుగా బులుసు సాంబమూర్తి ప్రసిద్ధ జాతీయ నేతలతో అజెండా సమావేశం నిర్వహణకు పురపాలక సమావేశ హాలులో కొలువైన గొప్ప ప్రదేశమని ప్రధాని పి.వి.నరసింహరావు విదేశాంగ మంత్రిగా ఉన్న హయాంలో ఇక్కడే సత్కారం అందుకున్నారని తెలిపారు.