కాకినాడ : దక్షిణ మధ్య రైల్వే శాఖ జనరల్ మేనేజర్ కాకినాడ పర్యటన సందర్భంగా పౌర సంక్షేమ సంఘం రైల్వే ప్రయాణీకుల సమస్యల పై అయిదు అంశాల వినతి పత్రాన్ని అందజేసింది. పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు టౌన్ రైల్వే స్టేషన్ లో జి ఎం అరుణ్ కుమార్ ను కలిసి వివరించారు. కాకినాడ నుండి వారణాశి అయోధ్య కు వారానికి ఒక సారి నిర్వహణ జరిగే విధంగా రైలు ప్రవేశ పెట్టాలని గౌతమి షిర్డీ శేషాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లలో జనరల్ భోగీలు పెంచాలని షిర్డీ ఎక్స్ ప్రెస్ లో స్లీపర్ క్లాస్ బోగీలు పెంపు చేయాలని కోరారు. కాకినాడ పట్టణ స్థాయి నుండి నగర స్థాయి కి అప్ గ్రేడ్ కాబడి 20 ఏళ్ళు అయ్యిందని, జనాభా లెక్కల ప్రకారం ఐదులక్షలు దాటిన రీత్యా రైల్వే రూల్స్ ప్రకారం టౌన్ స్టేషన్ ను సిటీ స్టేషన్ గా పేరు మార్పు చేయాలన్నారు. రైల్వే ఆధునీకరణ పనులు జరుగుతున్న దృష్ట్యా స్టేషన్ బయట టూవీలర్స్ పెయిడ్ పార్కింగ్ కు షెల్టర్ల నిర్మాణం చేయించా లన్నారు. ప్లాట్ ఫారాల వద్దకు రైళ్లు వచ్చే సమయంలో యాచకులు అసాంఘిక వ్యక్తులు రైల్వే ప్రయాణీకులను వేధిస్తూ అడ్డగిస్తూ డబ్బులు కోసం చేస్తున్న యాగీని పూర్తిగా నియంత్రణ చేసే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాత్రికేయులకు విషయాలను తెలియజేస్తూ ఏప్రిల్ నుండి ప్రతినెల 12వ తేదీన నగరం లోని రైల్వే బస్సు ప్రయాణీకుల సమస్య లపై ప్రభుత్వ చర్యలు కోరేందుకు నగర ప్రముఖులతో పౌర సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుందని తెలియజేసారు.