ఎల్.ఆర్.ఎస్ కాకుండా అక్రమ లేఅవుట్ లలోని ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయవద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని ఎల్ఆర్ఎస్ పై అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ..లే ఔట్ క్రమబద్ధీకరణ 2020 పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి ఫీజు తో పాటు ఓపెన్ స్పెస్ చార్జి లను మార్చి 31 లోపు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుందని అన్నారు.ఆగస్టు 26, 2020 వరకు 10% ప్లాట్లు విక్రయించిన లే ఔట్ లను క్రమబద్ధికరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, సబ్ రిజిస్టర్ ద్వారా 10% ప్లాట్లు విక్రయించిన లే ఔట్ లు ఎల్ఆర్ఎస్ కోసం నూతన దరఖాస్తు సమర్పించవచ్చని అన్నారు.క్రమబద్ధీకరించని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతించడం ఉండదని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రమ బద్దీకరణ చేసుకోవాలని, మార్చి 31 వరకు ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకొని 25% రాయితీ పొందాలని తెలిపారు.క్రమబద్ధీకరణ చేయని అక్రమ లే ఔట్ లలోని ప్లాట్ లను ఎట్టి పరిస్థితులలో రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిషేధిత జాబితాలో లేని, బఫర్, ఎఫ్.టి.ఎల్, చెరువులు కుంటలు తదితర ప్రాంతాలలో లేని ప్లాట్ల కు ఆటోమేటిక్ గా ఎల్ఆర్ఎస్ కు అనుమతి లభిస్తుందని చెప్పారు. చెరువులు నీటి వనరులు తదితర ప్రాంతాలకు 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలకు మాత్రం రెవెన్యూ నీటిపారుదల శాఖ అనుమతులు తప్పనిసరిగా చేయాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ అర్హత లేని స్థలాలపై చెల్లించిన ఫీజులు 90% రిఫండ్ అవుతుందని, 10 శాతం ప్రాసెసింగ్ కోసం తీసుకుంటామని అన్నారు . స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించిన వారికి అర్హత ఉంటే స్థల క్రమబద్ధీకరణ చేసి సంబంధిత ప్రొసీడింగ్స్ జారీ చేయాలని అన్నారు.ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు గంగయ్య,సురేష్,మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, మనోహర్,తహసిల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.