- “జనాభా లెక్కలు – డీ లిమిటేషన్ -ఎన్నికల సంస్కరణలు” అంశంపై సదస్సు నిర్వహించి
- రాష్ట్రపతికి పౌరవినతి పత్రం అందిస్తాం – పౌర సంక్షేమ సంఘం
కాకినాడ : జనాభా ప్రాతిపదిక గా పార్లమెంట్ సీట్ల సంఖ్య కేటాయింపులో దక్షిణాదికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. 1970వ దశకంలో నూరు శాతం కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాదికి ఒకే రకమైన నిష్పత్తి కేటాయిస్తే ఉత్తరాదికి ఎక్కువ దక్షిణాదికి తక్కువ సీట్లు ఏర్పడ తాయన్నారు. దక్షిణాదికి ఇప్పుడున్న సీట్ల సంఖ్య తగ్గకుండా చేసినా ఉత్తరాది సీట్లు పెరుగుతాయన్నారు. కుటుంబ నియంత్రణ పాటించిన వారికి ప్రభుత్వ పథకాలు విద్య ఉద్యోగ రాజకీయ ప్రయోజనాలు కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు అదే దిశగా దక్షిణాదికి ప్రత్యేక నిష్పత్తి కేటాయింపు ద్వారా పార్లమెంట్ సీట్లు దక్కాల్సిన అవసరం వుందన్నారు. రాజకీయ పార్టీలు తమ అవసరాలకు అనుగుణంగా డీ లిమిటేషన్ నిర్వహణ లో వారి అజెండా ఏరకంగా వున్నప్పటికీ జనాభా నియంత్రణ పాటించిన తెలుగు రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్లు దక్కాల్సిన వాటా రాకుంటే తిరుగుబాటు తప్పదన్నారు. ఇప్పటికే జనాభా ప్రాతిపదికన కేంద్రం నిధులు తెలుగు రాష్ట్రాలకు తగ్గిపోవడం వలన ఉత్తరాది రాష్ట్రా లతో పోలిస్తే 3నుండి 5శాతం వెనుకబడిన దుస్థితి దాపురించింద న్నారు. జనాభా లెక్కల సేకరణ జరగక పోవడం వలన పార్లమెంట్ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు కాకపోవడం వలన పరిపాలనలో పారదర్శకత కరువైన పరిస్థితి వచ్చిందన్నారు. మేధావులు, ప్రజా స్వామికవాదులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో పౌరసంఘం ఆధ్వర్యాన జనాభా లెక్కలు – డీ లిమిటేషన్ నిర్వహణ – ఎన్నికల సంస్కరణలు అంశంపై సదస్సు ఏర్పాటు చేసి న్యూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వయంగా ప్రజాభిప్రాయ వినతి అందిస్తామని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఒక ప్రకటనలో పాత్రికేయులకు తెలియజేసారు.