సూర్యాపేట: ప్రజా పాలనలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన ప్రజా సంఘాల జిల్లా బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు ఎన్నికల హామీలను వర్తింపజేసి అమలు చేయకపోతే ఉదృతమైన ప్రజా పోరాటం తప్పవని హెచ్చరించారు. అట్టడుగు వర్గాన ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కేవలం కొద్ది మంది ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని గత ప్రభుత్వ వైఫల్యాలను సాకుగా చూపించి ఇచ్చిన హామీలను విస్మరిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిన నేటికీ ఏ ఒక్క పేదవాడికి ఇంటి స్థలం పట్టాలు ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ప్రచార ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్ప అసలైన పేదవారికి మంజూరి ఇవ్వటం లేదన్నారు. పేదల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను రక్షించి పేదలకుపట్టాలు ఇవ్వాలన్నారు. తక్షణమే పేదల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు, రోడ్లు, డ్రైనేజీ, కరెంటు ఇంటి నెంబర్లు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని వెంటనే అమలు చేసి రైతుల కష్టాలను తీర్చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల మేలు కొరకు తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ధరణి కారణంగా రైతులు చాలా నష్టపోయారని పట్టేదారులు కాకుండా పోయారని భూమి పైన ఉన్న కూడా పట్టా లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఉన్నదని, భూభారతి చట్టం ద్వారా మొత్తం భూములను సర్వే చేసి ఎవరైతే భూమి మీద ఉండి పట్టా లేకుండా వున్నారో వారికి పట్టాలను ఇచ్చి, నకిలీ పట్టాదారులను రికార్డుల నుంచి తొలగించి అసలైన పట్టేదారులకు న్యాయం చేయాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి కో లిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, ప్రజానాట్యమడలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, టిపిటిఎల్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా పల్లి నరసింహారావు, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, జిఎంపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్, ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.