సూర్యాపేట:బిసీలకు 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో కల్పించేలా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని,రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టరు ఊర రామ్మూర్తి యాదవ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మహావీర్ ఫుడ్ కోర్ట్ లోని మినీ ఫంక్షన్ హాల్ లో బుధవారం జన సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తగుళ్ల జనార్ధన్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీలకు స్థానిక సంస్థలతో పాటు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా కుల గణనతోపాటు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్ తీర్మానించడం హర్షణీయమని తెలిపారు. ఈ రిజర్వేషన్లను ముస్లింలకు 10 శాతం వర్తిస్తాయనే సాకుతో బిజెపి పార్టీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించకుండా అడ్డుకోవడం బీసీలను మోసం చేయడమేనని విమర్శించారు. గతంలో కూడా బిజెపి రథసారథులు వాజ్ పయ్, అద్వానీ, నేటి ప్రధాని నరేంద్ర మోడీ రిజర్వేషన్లపై నోరు మెదపకపోవడం విడ్డూరమన్నారు. మండల్ కమిషన్ కల్పించిన ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కూడా పూర్తిగా అమలు కాకుండా నాటి నుంచి నేటి వరకు పాలకులు అడ్డుకోవడం శోచనీయమని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో కూడా బీసీలకు తీరని అన్యాయం జరిగిందని తెలిపారు. తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రం బీసీలకు రిజర్వేషన్ లు కల్పించాలని కోరారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా కానీ బీసీల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. రిజర్వేషన్ల బిల్లు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి దాన్ని అమలు అయ్యేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పై ఒత్తిడి తెచ్చేలా ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించడం పట్ల వక్తలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, బహుజన మహాసభ నాయకులు వెంకట్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సైదులు, జై భారత్ రాష్ట్ర నాయకులు గుండు వెంకన్న, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మర్యాద సైదులు యాదవ్, తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర నాయకులు సందీప్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బొల్లెద్దు వినయ్, బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు భద్రబోయిన సైదులు, యాదవ రాజ్యాధికార సాధన సమితి నాయకులు బడుగుల నాగార్జున్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు కోల కర్ణాకర్, జన సమితి విద్యార్థి సంఘం నాయకులు బొమ్మగాని వినయ్, జన సేవా సమితి నాయకులు మల్లేష్, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు.*