గొల్లప్రోలు : ఆరుగాలం శ్రమించే రైతులకు పంటల సాగులో కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు వర్షాబావ పరిస్థితులతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతూ మరోవైపు యూరియా కొరతతో ఆందోళన చెందుతున్నారు. సార్వా ప్రారంభంలోనే యూరియా అందుబాటులో లేకపోవడంతో సొసైటీలు, రైతు సేవా కేంద్రాల వద్ద సరుకు కోసం పడిగాపులు కాస్తున్నారు. యూరియా కొరతను అదునుగా భావించి కొన్ని ప్రైవేట్ షాపులలో యూరియాను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గొల్లప్రోలు పట్టణ మండల పరిధిలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా యూరియా లభించకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. నారుమడులకు సైతం యూరియా దొరకక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వరి నాట్లు ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పరంగా ఆయా సొసైటీలు, రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని అధికారులు ప్రకటిస్తున్నా అది అంతంత మాత్రమేనని పలువురు పేర్కొంటున్నారు. ఎరువుల డీలర్లు తమ ప్రత్యామ్నాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తేనే సరుకు ఇస్తామని షరతులు విధిస్తుండడంతో చాలా ప్రైవేట్ షాపులలో యూరియా స్టాకు పెట్టడం లేదు. దీంతో యూరియా కోసం రైతులు సొసైటీలు, రైతు సేవా కేంద్రాలపైనే ఆధారపడవలసి వస్తోంది. ఇక్కడ కూడా ఒక్కొక్క రైతుకు 2 బస్తాలకు మించి ఇవ్వకపోవడంతో అవి పొలంలో వేయడానికి సరిపోక అవి ఏం చేయాలో అర్థం కాక సతమవుతమవుతున్నారు. కొన్ని ప్రైవేటు షాపుల్లో సరుకు ఉన్నా రూ.270/-లకు అమ్మ వలసిన యూరియా బస్తాను రూ.330/- నుండి రూ.350/-ల వరకు విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో యూరియా అసలు దొరకే సమృద్ధిగా లభించేదని ప్రస్తుతం యూరియా కోసం అవస్థలు పడవలసి వస్తుందని రైతులు వాపోతున్నారు. గత ఏడాది సార్వా, దాల్వా సీజన్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైందని రైతులు గుర్తు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, కాలువల ద్వారా సక్రమంగా నీరు అందకపోవడంతో వరి నాట్లు ఆలస్యమయ్యాయని ప్రస్తుతం కాలువల ద్వారా నీరు అందుతుండడం, అడపాద అడపా చిరుజల్లులు పడుతుండడంతో క్రమంగా వరి నాట్లు వేస్తున్నారని ఈ పరిస్థితులలో పంటల అవసరాలకు తగినంత యూరియా సరఫరా అయ్యేవిధంగా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
- వ్యవసాయాధికారి వివరణ
రైతులకు యూరియా కొరత లేకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి కె వివి సత్యనారాయణ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలో వివిధ పంటల కోసం 540 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 480 మెట్రిక్ యూరియా సరఫరా అయ్యిందన్నారు. సొసైటీలు, రైతు సేవా కేంద్రాలలో మరిన్ని యూరియా నిల్వలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయాధికారి సత్యనారాయణ తెలిపారు.