- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు
- తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు
కాకినాడ : పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్న మత్యకారులకు గత ఆరు నెలలుగా మత్స సంపద లేక అప్పుల ఉబులో కూరుకుపోయారని, వారికి జీవన ఉపాధి కల్పించాలని తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ యానం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో ప్రతి మత్స్యకార కుటుంబాలకు ఏ విధంగా గౌరవ వేతనం ఇస్తున్నారో అదే విధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మత్స్యకార కుటుంబాలకు గౌరవ వేతనం ఇవ్వాలని ఆయన ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ని అభ్యర్థించారు. మత్స్యకారులు సరైన వసతులు లేక తీర ప్రాంతంలో ఉంటున్న ఏరియాలో సముద్రం కోతతో కొన్ని వందల ఇల్లు జలమయం అయ్యాయని, వారందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పునరావాసం కల్పించి కొత్త ఇల్లు కట్టి ఇవ్వాలని ఆయన కోరారు. సముద్రానికి ముందుకు రాకుండా తక్షణమే అడ్డుగట్టు వేయాలని, లేనిచో గ్రామాలు జలమయం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మత్స్యకార గ్రామాలు కరప మండలం ఉప్పలంక నుండి తొండంగి మండలం అద్దరిపేట వరకు సుమారు 67 గ్రామాలు ఉన్నాయని, ఈనాడు వాళ్ల పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉందన్నారు. మత్స్య సంపద లేక అల్లాడిపోతున్నారని, వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా తీరప్రాంతాలైన కరప మండలం ఉప్పలంక నుండి తొండంగి మండలం అద్దరిపేట వరకు ప్రతి మత్స్యకారుల కుటుంబానికి రూ.11,500లు గౌరవ వేతనం ఇవ్వాలని, యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ మరియు కాకినాడ జిల్లాలో ఉన్న యువకులకు ప్రైవేట్ కంపెనీలో 20 శాతం ఉద్యోగాలు కల్పించాలని ఆయన కోరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలలో ఒక మాట ఇచ్చారంటే ఆ పని పూర్తి చేస్తారని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్కరే అని పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు కొనియాడారు. రేపు ఉప్పాడ వస్తున్న సందర్భంగా ఆయనను కలిసి మత్స్యకారుల యొక్క సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేస్తానని వెంకటేశ్వరరావు తెలిపారు.