పిఠాపురం : శ్రీ విశ్వావసు నామ ఉగాది సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్పూర్తి కుటుంబం ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో యువ రచయిత, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్, సోమ సుందర్ లిటరరీ ట్రస్ట్ కోఆర్డినేటర్, పిఠాపురం సాహితీవేత్త డాక్టర్ కిలారి గౌరీ నాయుడు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్పూర్తి రచనలు – ఆధునిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సామాజిక దృక్పథం అనే అంశంపై ప్రత్యేక ప్రసంగం చేశారు. ఉగాది ప్రాముఖ్యతను వర్ణిస్తూ కవితా పఠనం కూడా చేశారు. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుందని గౌరీ నాయుడు తెలిపారు. జీవితంలో వచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశం ఉగాది పచ్చడి అందిస్తుందని గౌరీ నాయుడు తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించిన సదాశివ, కవి దాసు సభకు గౌరీనాయుడును పరిచయం చేశారు, ఈ కార్యక్రమ విశిష్ట అతిథి ఆంధ్ర విశ్వ కళాపరిషత్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య నరసింహారావు గౌరీనాయుడునీ ప్రత్యేకంగా అభినందించారు. తమ ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి డాక్టర్ కిలారి గౌరీ నాయుడు ఇటీవల కాలంలో రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సాహిత్య పురస్కారం అందుకోవడం చాలా గర్వంగా ఉందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా గౌరీ నాయుడు మాట్లాడుతూ సాహిత్య, సంగీత, సాంస్కృతిక, పరిశోధక, కళా రంగాలలో కృషి చేయడానికి సహకారాన్ని అందిస్తున్న ఆచార్యులకు, గురువులకు, సాహితీవేత్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాహిత్య, సాంస్కృతిక, పరిశోధనా రంగాలలో తాను చేస్తున్న కృషికి ముప్పై ఐదు ఏళ్ల వయసుకి 35 అవార్డులు అందుకోవడం నాపై మరింత బాధ్యత పెంచిందని గౌరీ నాయుడు తెలిపారు. సాహిత్య, కళారంగాలలో గౌరీనాయుడు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, కవులు, కళాకారులు, కుటుంబ సభ్యులు, సాహితీ సంస్థల ప్రతినిధులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.