ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులు ఒకటే – ప్రీమియం రైళ్లలో టీ, కాఫీ, బిర్యానీలు అంటే ఆకాశమే ధర పాడుతోంది. మెనూ రేట్లకు, కౌంటర్ రేట్లకు పోలిక లేకుండా పోయింది. ఈ గందరగోళానికి అడ్డుకట్ట వేయాలని భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంది. అనధికారిక విక్రేతలను, ధరల మోసాన్ని పూర్తిగా అరికట్టేందుకు బలమైన అడుగులు వేస్తోంది.
ఇకపై ప్రీమియం రైళ్లలో ఆహారం అమ్మే ప్రతి సిబ్బందికి గుర్తింపు కార్డు, యూనిఫాం తప్పనిసరి. వందేభారత్, రాజధాని, షతాబ్ది, తేజస్ వంటి రైళ్లలో నేవీ బ్లూ టీ-షర్ట్, మిగతా ప్రీమియం రైళ్లలో లైట్ బ్లూ టీ-షర్ట్ ధరించాల్సి ఉంటుంది. ఈ యూనిఫాం మీదే అధికారిక మెనూ, ధరల జాబితా క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తారు. ప్రయాణికులు ఫోన్ స్కాన్ చేస్తే వెంటనే ఏం ఎంత రేటుకు దొరుకుతుందో తెలుస్తుంది.
అంతేకాదు, యూనిఫాం మీదే ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ప్రింట్ చేస్తారు. ఎక్కువ ధర కోరినా, నాణ్యత లేకపోయినా వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఈ విధానం అమలయితే అనధికారిక విక్రేతలు రైలు పెట్టెల్లోకి రావడం కష్టమవుతుందని, ప్రయాణికులకు పారదర్శకత లభిస్తుందని IRCTC అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంమీద ఈ కొత్త చర్యలతో రైలు ప్రయాణంలో ఆహార ధరల గందరగోళం తగ్గుతుందని, ప్రయాణికులు మోసపోకుండా సేఫ్ అవుతారని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి.
