హైదరాబాద్, డిసెంబర్ 23 : ప్రచారం మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్త్రీ శక్తి ప్రతిభ పురస్కారాలు – 2025’ కార్యక్రమంలో ఆచార్య చింతకింది సద్గుణకి ‘కల్చరల్ ప్రిజర్వేషన్ అండ్ నాలెడ్జ్ ఎక్సలెన్స్ అవార్డు–2025’ను ప్రదానం చేశారు. ఈ అవార్డును మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ చైర్మన్ మరియు మేడ్చల్ – మల్కాజ్గిరి శాసనసభ్యుడు మల్లారెడ్డి, మల్లారెడ్డి ఇంజినీరింగ్ ఊమెన్ యూనివర్సిటీ డైరెక్టర్ డా. ప్రీతి, శ్రీలంక మరియు బంగ్లాదేశ్ దేశాల విదేశీ రాయబార కౌన్సిలర్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా ఆచార్య సద్గుణ మాట్లాడుతూ “భారత దేశానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట తీసుకువచ్చినవి రెండు మాత్రమే. ఒకటి భారతీయ సంస్కృతి, రెండవది సంస్కృత భాష” అని అన్నారు. అలాగే ఉపనిషత్తులు మరియు భగవద్గీత శ్లోకాలను ఉదహరిస్తూ, స్త్రీ శక్తి ప్రతిభ యొక్క మహత్తును వివరించారు. సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి స్త్రీలలో ఉందని పేర్కొన్నారు. తాము నిర్వహిస్తున్న ఏకదంత – ది స్కూల్ ఆఫ్ ఏన్షెంట్ స్టడీస్ సంస్థ యొక్క నినాదం “సంస్కృతము నేర్చుకుందాం – మన సంస్కృతిని తెలుసుకుందాం” అని తెలిపారు.
సంస్కృత భాష నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఏకదంత వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా నేర్చుకోవాలి అని యువతను ఆకట్టుకునేలా పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఏకదంత వెబ్‌సైట్ ద్వారా 3000 మందికి పైగా విద్యార్థులు ఉచితంగా సంస్కృతం నేర్చుకుంటున్నారు అని వెల్లడించారు. అలాంటి స్త్రీ శక్తి ప్రతిభలను గుర్తించి, ఎంపిక చేసి, పురస్కారాలతో గౌరవించడం ప్రచారం మీడియా సంస్థ చేసిన అభినందనీయమైన కార్యమని ఆచార్య సద్గుణ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మేడ్చల్ పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, నృత్యకారిణి గెడ్డం పద్మజ, దేశీ – విదేశీ అతిథులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఘనంగా చేశారు.
