అధికారంలో వున్న బిజేపి ప్రభుత్వం మహాత్మా గాంధీని మరోసారి హత్యచేశారని జిల్లా కమిటీ సభ్యురాలు విజయలక్ష్మి గారు మరియు గ్రామ శాఖ కార్యదర్శి కొండారెడ్డి గారు అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినజి రామ్ జి బిల్లు వ్యవసాయ కార్మికులకు, పేదలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ బిల్లునుఉపసంహరించుకోవాలని మహాత్మా గాంధీ పేరు మార్పులు ఉపసంహరించుకోవాలని పాత చట్టాన్ని యధావిధిగా ఉంచాలని గ్రామ సర్పంచ్ ఇదిరనరసయ్య గారు డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం, రైతు సంఘం,ఐద్వా మరియు DYFI గ్రామశాఖసభ్యులఆధ్వర్యంలో మునగాల మండలం నరసింహుల గూడెం గ్రామంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ కొత్త బిల్లును వ్యతిరేకిస్తు నిరసన తెలియ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన అంగ బలంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దుచేసి ఆ స్థానంలో జి రాంజీ ఉపాధి బిల్లును తీసుకురావడం జరిగిందని,ఇది దేశంలోని వ్యవసాయ కార్మికులకు, పేద రైతులకు తీవ్ర నష్టమని అన్నారు. ఉపాధి హామీ పథకానికి ఉన్నమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు మార్చి జి రాంజీ పేరు పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రతి కుటుంబానికి100 రోజుల పని నుండి 125 రోజులు పెంచుతున్నామని ఎన్ డి ఏ ప్రభుత్వం పార్లమెంటులో వాదించడం దుర్మార్గమని అన్నారు. కోట్లాదిమంది గ్రామీణ వ్యవసాయ కార్మికులు, ఇతర పేదలకు భరోసాగా ఉన్న 100 రోజులు పని కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు చేయాలని ఆలోచన బిజెపి ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చిందని ఈ ఆలోచన తుది రూపం జి రామ్ జి బిల్లు అన్నారు.జి రామ్ జి బిల్లు ద్వారా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాస్త పథకం రూపంలోకి మార్పు చేశారని ఆయన విమర్శించారు. రానున్న కాలంలో గ్రామీణ పేదలు పనిని హక్కుగా పొందే అవకాశం ఉండదని అన్నారు. జి రాంజీ ఉపాధి బిల్లులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని పేర్కొనటం ఉపాధి చట్టాన్ని నీరుగార్చటమే అన్నారు. దీనివల్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యల మీదనే ఈ పథకం అమలు కావడానికి అవకాశం ఉందని విమర్శించారు. పని ప్రదేశాలలో యంత్రాల వినియోగం పై ఉన్న నిషేధాన్ని కూడా ఈ బిల్లులో ఎత్తివేశారని, ఇది కాంట్రాక్టర్లకు అనుకూలమైన నిర్ణయం అని అన్నారు. 2004 లో సిపిఎం వామపక్ష పార్టీల మద్దతుతో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వంపై వత్తిడి చేసి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సిపిఎం, వామపక్ష పార్టీలు తీసుకువచ్చాయని గుర్తు చేశారు. గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా ఇచ్చి చట్టాన్ని రద్దు చేయడం వల్ల కోట్లాదిమంది పేదలకు నష్టం వాటిల్లనున్నదని అన్నారు. తక్షణమే జీ రామ్ జీ బిల్లును ఉపసంహరించుకొని పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో రాపోలు సూర్యనారాయణ, మండలకమిటి సభ్యులు నరసయ్య,ఉపసర్పంచ్ సీతారాములు,వార్డు నెంబర్లు,గ్రామశాఖ కార్యదర్శులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు
