కామారెడ్డి మద్నూర్ మండలం నిన్న వికారాబాద్ జిల్లాలో జిల్లా అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ దాడుల సంస్కృతి సరైంది కాదని మద్నూర్ మండల తహసీల్దార్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల లో ఫార్మా కంపెనీలకు భూ సేకరణ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ , అదనపు కలెక్టర్, తహసిల్దార్, రెవెన్యూ, తదితర అధికారులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ అన్నారు. దాడిని నిరసిస్తూ..మంగళవారం మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బ్లాక్ రిబ్బన్ ధరించి సిబ్బందితో కలిసి నిరసన తెలిపారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ నిరసనలు శాంతియుతంగా చేయాలని, దాడుల వల్ల కేసులు అయ్యి జీవితాలు నాశనం చేసుకోవడం కన్న ప్రజలు చెప్పదలచుకున్నది ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్న అధికారులకు చెప్పాలని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందికి రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.