57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 20వరకు జిల్లా కేంద్ర గ్రంధాలయంలో నిర్వహించే గ్రంధాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గ్రందాలయంలో గ్రంధాలయ వారోత్సవాల ఆహ్వానపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. గ్రంధాలయాలు విజ్ఞాన బండాగారాలని నాడు జరిగిన గ్రంథాలయోద్యమానికి పునాదులు వేసింది సూర్యాపేట గ్రంధాలయమని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు సాధించడానికి గ్రంధాలయాలు ఎంతో ఉపకరిస్తున్నాయన్నారు. సూర్యాపేట గ్రంధాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమైన ఎంతో మంది నేడు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14న జ్యోతి ప్రజ్వలన, 15న పుస్తక ప్రదర్శన, 16న వ్యాసరచన పోటీలు, 17న పాటల పోటీలు, 18న కవి సమ్మేళనం, 19న మహిళా దినోత్సవం, 20న ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ప్రారంభ వేడుకలకు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో పాటు శాసనసభ్యులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. పాఠకులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని వారోత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి బి. బాలమ్మ, జిల్లా గ్రంధాలయ అసిస్టెంట్ లైబ్రేరియన్ వి.శ్యాంసుందర్రెడ్డి, ఆయా గ్రంధాలయాల లైబ్రేరియన్లు ఎం.వి.రంగారావు, ఆర్. విజయభాస్కర్, సైదానాయక్, ఎం.వెంకట్, ఆలూరి విక్రమ్బాబులు పాల్గొన్నారు.

previous post
next post