జోగిపేటః మెడికల్ టూరిజం అభివృద్దిలో భాగంగా టర్కీ – తెలంగాణ ల మధ్య మెరుగైన సంబంధాలను పునరుద్ధరణ జరగాలని కోరుకున్నారు. మెడికల్ ఫ్యాకల్టీ, మెడికల్, మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ – టర్కీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని కోరుకున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇండియాలోని టర్కీ రాయబారి ఫిరాట్ సునెల్ హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ – టర్కీ దేశాల మధ్య నిజాం కాలం నుండి మెరుగైన సంబంధాలు ఉండేవన్నారు. టర్కీ రాయబారి హైదరాబాదులోని సంస్కృతి సాంప్రదాయాలను చూసి తను సొంత దేశంలో ఉన్న అభిప్రాయం కలిగిందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో విద్యా, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ టర్కీ దేశపు రాయబారి ఫిరాట్ సునెల్ కు వెల్లడించారు. ముఖ్యంగా సామాన్యులకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 34 ప్రభుత్వ మెడికల్ కళాశాల తో పాటు 28 నర్సింగ్ కళాశాలలు, పారామెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 74 ట్రామా కేర్ సెంటర్లు తో పాటు మెరుగైన హెల్త్ ఎడ్యుకేషన్ ను రాష్ట్రంలో అందించేందుకు ప్రణాళికలను రూపొందించామన్నారు. 60 శాతం బల్క్ డ్రగ్ ఉత్పత్తులు తెలంగాణ నుండి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్, టీజీఎంఎస్‌ఐడీసీ హేమంత్ సహదేవ్ రావ్ లు పాల్గొన్నారు.