సంగారెడ్డి జిల్లా ఆందోలు నియోజకవర్గం ఫరిది లోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్ట్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.దామోదర రాజనరసింహా అన్నారు. ఆదివారం అధికారులతో కలిసి ప్రాజెక్టు ను సందర్శించారు. ఈ ప్రాంత వాసులకు ఆహ్లదంతో పాటు, పర్యాటకులతో ఉపాధి కూడా దొరుకుతుందన్నారు.ఆందోల్ నియోజకవర్గంలోని పలు విద్యా సంస్థల్లో స్థానిక ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ పర్యటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడిన మంత్రి, అక్కడి సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత ఆందోల్‌లోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్‌లో పర్యటించిన మంత్రి, ఆ తర్వాత పుల్కల్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను సందర్శించారు. ఆయా విద్యా సంస్థల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. కిచెన్‌లో ఉన్న ఆహార సామాగ్రిని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని అధికారులకు సూచించారు. భోజనం విషయంలో ఏదైనా తప్పు జరిగితే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చలికాలం నేపథ్యంలో స్టూడెంట్స్‌కు సరిపడా దుప్పట్లు అందజేయాలని, హాస్టల్ కిటికీలు పగిలిపోయినవి ఉంటే వెంటనే రిపేర్ చేయించాలని ఆదేశించారు. ఇంకేవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అందోల్‌ను విమెన్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మాయిలు వచ్చి, ఆందోల్‌లోని విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై, అధికారులు, టీచర్లపై ఉందన్నారు. అన్ని విద్యా సంస్థల చుట్టూ కాంపౌండ్ వాల్స్ నిర్మిస్తున్నామని, నీటి, కరెంట్ సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇంటర్నల్ రోడ్లు, గ్రౌండ్, లైబ్రరీ వంటి అన్ని సదుపాయాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.
మంత్రి వెంబడి పలువురు అధికారులు, నాయకులు ఉన్నారు.