ప్రసిద్ధ వర్గల్ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య క్షేత్రంలో శనివారం సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక చైర్మన్, బ్రహ్మశ్రీ, యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు తెల్లవారుజామున ఉత్సవానికి అంకురార్పణ చేయగా, అనంతరం సతీసమేతులైన శ్రీ స్వామి వారికి విశేష అభిషేకం, ప్రత్యేక పూజలు, లక్ష పుష్పార్చన, శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవoగా జరిగింది. స్వామి వారి జన్మదినమైన సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా తెల్లవారు జామునుండే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడం కనిపిoచింది. కాగా సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్య సమస్యలు తొలగుతాయని, అష్టైశ్వర్యాలు సమకూరుతాయని, గ్రహ దోషాలు తొలగుతాయని, విశేష ఫలితాలు వస్తాయని, స్వామివారి కృపాకటాక్షాలు, సంపూర్ణ ఆశీస్సులు ఉంటాయని ఆలయ చైర్మన్, సిద్ధాంతి చంద్రశేఖర శర్మ పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని షణ్ముఖుడు, కార్తికేయుడు, కుమారస్వామిగా భక్తులు స్థూతిస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టిగా పేర్కొంటూ స్వామి వారి జన్మదినం సందర్భంగా ఉపవాస దీక్షతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వివరించారు. సుబ్రహ్మణ్య షష్టి వేడుకల సందర్భంగా ఆలయ సముదాయాన్ని నిర్వాహకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.