రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని వైద్యులు తరచూ చెబుతుంటారు. యాపిల్‌లో అనేక వ్యాధులను నివారించే శక్తి ఉంది. అందుకే దీన్ని క్రమం తప్పకుండా తినాలని వైద్యులు చెబుతుంటారు. కానీ యాపిల్ ఎలా తినాలి అనే ప్రశ్న కొంతమందిలో ఉంటుంది. అంటే వీటిని పండుగానే తినాలా? లేదంటే జ్యూస్ రూపంలో తీసుకోవాలా? అని తెగ ఆలోచిస్తుంటారు. ఈ రెండు పద్ధతుల్లో ఏది ఎక్కువ ప్రయోజనకరమైనది? అనే దానికి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా ఆరోగ్య నిపుణుల అభిప్రారయం ప్రకారం.. యాపిల్ రసం కంటే పండ్లు తీసుకోవడం ఎక్కువ ప్రయోజనకరమట. యాపిల్ తినడం వల్ల ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ జ్యూస్ తయారు చేసి, అందులో చక్కెర జోడించి తాగడం వల్ల కేలరీలు గణనీయంగా పెరుగుతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే, యాపిల్ రసంలో ఫైబర్ ఉండదు. అలాగే యాపిల్ ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల, అవి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ ఎరుపు లేదా ఆకుపచ్చ ఆపిల్ ఏదో ఒకటి తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా, యాపిల్ తొక్కలలో ఉండే పెక్టిన్, ఇతర జీర్ణ ఎంజైములు జీర్ణక్రియకు సహాయపడతాయి. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తాయి. కానీ యాపిల్ రసం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి కాలేయంపై ఒత్తిడి పెంచుతుంది. అందువల్ల, యాపిల్ జ్యూస్ కంటే పండ్లు తీసుకోవడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల, వీలైనన్ని ఎక్కువ పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.