కవిత్వం
నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, భావాలను బయటకు చూపిస్తుంది, లోలోపల మరుగుతున్న జ్ఞాపకాలకు ఊరటనిస్తుంది, ఉద్వేగాన్ని, నిశ్చలత్వాన్ని, నిడారంబరతను, నవ్వుల వెనుక దాగున్న తూటాలను బయటకు చూపిస్తుంది, కవ్విస్తుంది, కన్నీటిలో ముంచేస్తుంది, మృదువుగా మందలిస్తుంది, కఠినంగా కాటేస్తుంది…
కవిత్వం తరగని ఘని, విరగని ధ్వని, కవులకు కవిత్వమే మనీ మనీ…
కొందరు కవులు ప్రాసను ఉపయోగిస్తారు
ఇంకొందరు భావుకత్వానికి రూపాన్ని ఇస్తారు…
మన లహరి గారి కవిత్వం అమ్మ చేతి గోరుముద్దలా కమ్మని భావాలతో దర్శనమిస్తుంది, కాంచీపురం పట్టుచీరలా సోయగాలు వలకబోస్తుంది, పుల్లని మామిడిలా గిల్లకుండానే ప్రశ్నిస్తుంది, తీయని ఖర్జూరంలా తిడుతూనే నిజమేంటో చెబుతుంది…
ఇక కవిత్వం విషయానికి వస్తే
******
శీర్షిక : విలోమ దృశ్యం
*****
చూసే కళ్ళు
నిత్యం కలలు
కంటూనే ఉంటాయి
గడ్డ కట్టిన మనసు
కరిగి ధార కట్టినపుడు
సుడులు తిరిగిన అలలు
కన్నీళ్ళై స్రవిస్తాయి
కలలో నువ్వుండాలి
కన్నీటికి కారణం మాత్రం
నువ్వు కాకూడదు
మౌనంతో తొంగి చూస్తే
ఎదలో కదిలిన
ఏదో చప్పుడు
నీ మాటల్లో ధ్వనించే మాధుర్యం
అడుగుల్లో తొణికిసలాడే
రమణీయ మృదుత్వం
చేతల్లో ఉట్టిపడే సౌమ్యత
చూపుల్లో తొంగిచూసే నిర్మలత
ఇలా ఏమని
చెప్పమంటావు
ఎన్నని విప్పమంటావు
జీవితం రహస్య సేతువని
ఎవరో చెబితే విన్నాను
శూన్యం ఆవహించిన క్షణాల్లో
నిశ్శబ్దం బద్ధశత్రువని తెలుసుకున్నాను
కానీ నాలో
కొత్త ఊసులు ప్రవహిస్తుంటే
అది నీ ప్రతిరూపమే
అని తెలిసాక
నేను నువ్వే
నువ్వు నేనే
అయినా
మనసులోతుల్లో ధ్వనించే
అస్పష్ట దృశ్యాలేవో
కలవర పెడుతుంటే
నేను నెమరేసుకునేది
అక్షరాలా నిన్నే!
ఇప్పుడు నువ్వు
రేపు నేను
అంతా కలగా
నాలోంచి నీకు
నీలోంచి నాకు
ఒక విలోమ స్వప్నం
కలలోంచి ఊహల్లోకి
కరిగిపోతూ నేను..!
*****
రచయిత : ఎన్ లహరి
*****
నిజమే కలలు కనని మనసు ఉందా మనిషి ఉన్నాడా ఈ లోకంలో, అలాగే మనసుకి గాయం చేయని బంధం ఉంటుందా, ఉంటే ఆ బంధం కలకాలం తోడుగా నిలబడుతుందా..!?
కవయిత్రి రాసే ఒక్కో అక్షరంలో ఎంతో ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది…
కలలో నువ్వు ఉండాలి కానీ కన్నీటికి కారణం నువ్వు అవ్వకూడదు అంటూ ఆ ప్రేమను ఎంతో సున్నితంగా స్వేచ్ఛగా తెలియజేస్తున్నారు…
ప్రేమలో మౌనాన్ని జోడించి ప్రేమిస్తున్న ఆ వ్యక్తిపై చూపే భావాలను సున్నితంగా మృదువుగా అక్షరాలతో అమర్చారు మన కవయిత్రి…
నిజమే ప్రేమ గురించి ప్రేమించిన వారి గురించి ఎంత చెప్పినా తక్కువే…
జీవితం రహస్య సేతువని ఎవరో చెబితే విన్నాను
శూన్యం ఆవహించిన క్షణాల్లో నిశ్శబ్దం బద్ధశత్రువు అని తెలుసుకున్నాను అంటూ ప్రేమించిన ప్రేమే కాలనాగై కాటేస్తుంది అని చెప్పకనే చెప్పారు కవయిత్రి…
కానీ ముట్టక చెడినా,ముట్టి చెడినా
ప్రాణం అనుకున్నా కాబట్టే క్షణ క్షణం నీవు నాలో అంతర్లీనమై పోయావు అంటూ హృదయ లోతు భావాలను బద్దలు కొట్టారు…
కనీవిని ఎరుగని దృశ్యాలేవో మనసు లోతుల్లో కలవర పెడుతుంటే ఆ క్షణాన కూడా నేను తలచుకునేది నిన్నే అంటూ ఆ ప్రేమ వైరాగ్యాన్ని కనులకు కట్టినట్టు చూపిస్తున్నారు…
ఇప్పుడు నువ్వు – రేపు నేను
అంతా కలగా నాలోంచి నీకు – నీలోంచి నాకు ఒక విలోమ స్వప్నమే నీవు నేను అంటూ…
కల నుంచి ఊహలోకి తీసుకుపోయి పాఠకుల మనసుని కరిగించేశారు కవితలో ఆమె ఆవిరవుతూ…
*****
సమీక్షకురాలు : పోలగాని భానుతేజశ్రీ MBA LLB
కృష్ణా జిల్లా