పిఠాపురం : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని “మహిళా సాధిక సమైక్య సేవా సమితి” ఆధ్వర్యంలో “ఉత్తమ నారి శక్తి పురస్కారాలు” అందజేశారు. పట్టణంలో శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీస్, లాయర్, ఉపాధ్యాయ, యోగ, సంగీతం, టైలరింగ్, భ్యూటిషన్ వంటి వివిధ రంగాలలో రాణిస్తున్న ఎనిమిది మంది మహిళలకు ఉత్తమ పురస్కారాలు అందజేశారు. ముందుగా బాలికలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మహిళ అంటే కేవలం వంటింటికే పరిమితం కాకుండా అమ్మగా అందరి ఆలనా పాలనా చూస్తుంది. సోదరిగా తోడు ఉంటుంది, అర్ధాంగిగా బాగోగులు చూస్తుంది, దాసిలా నిత్యం పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుందని, నేల నుండి నింగి వరకు ప్రయాణించగల శక్తి మహిళలకు ఉందని, అలాగే అన్ని రంగాలలోనూ మేము సైతం అంటూ ముందుకు వీరనారీలా కదం తొక్కుతుందని అన్నారు. తన విధులు నిర్వర్తిస్తూ… తమ తమ కళా నైపుణ్యాలు ప్రదర్శిస్తూ అన్ని రంగాలలోనూ రాణిస్తున్న మహిళలను గుర్తించి గౌరవించే వేడుకలు జరుపుకోవడం ఉత్తమ పరిణామం అని అన్నారు.